రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలనుకుంటున్న ఫోర్త్‌సిటీకి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఫోర్త్‌సిటీ నిర్మాణంలో భాగంగా ముందుగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీచేసింది. ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు వరకు సుమారు 42 కి.మీ. దూరం 330 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని కోసం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంది. ఇందులోభాగంగా ప్రభుత్వం అవసరమైన భూములపై సర్వే నిర్వహించింది.
కాని, బాధిత రైతులు సర్వేను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసు బలగాల సహకారంతో రెవెన్యూ అధికారులు హద్దులను ఏర్పాటుచేశారు. ఫేస్-1లో 18.5, ఫేస్-2లో 22 కి.మీ. రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. ఫేస్-1లో 440, ఫేస్-2లో 545 ఎకరాల వరకు సేకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భూసేకరణలో భాగంగా రైతులు అడుగడుగునా అడ్డు తగులుతుండటంతో భూసేకరణకు అనేక అడ్డంకులెదురయ్యాయి. ఒకానొక దశలో రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భూముల వివరాలను సేకరిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు భూసేకరణను నిలిపివేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు బలవంతంగా పోలీసుల సహకారంతో హద్దురాళ్లు ఏర్పాటుచేశారు. కాని, రైతుల అంగీకారం ఉంటేనే భూసేకరణ జరపాలని నిబంధన ఉండటంతో రైతులు గ్రామాలవారీగా బహిరంగ విచారణ జరుపుతున్నారు. జిల్లా భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామాలవారీగా బహిరంగ విచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరుతున్నారు. ఇప్పటికే మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు, ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, లేమూర్ తదితర గ్రామాల్లో బహిరంగ విచారణ కార్యక్రమాలను నిర్వహించారు. భూములిచ్చేది లేదని.. దీంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను బహిష్కరించారు.
భూమికి భూమి ఇవ్వాలి
మీర్ఖాన్పేట్ గ్రామంలో సోమవారం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు నేతృత్వంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భూములివ్వడానికి ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని రైతులను కోరారు. మీర్ఖాన్పేట్లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతో సుమారు వంద ఎకరాల వరకు భూమిని రైతులు కోల్పోతున్నారు. ఈ భూమి దేవాదాయ భూమి అయినప్పటికీ తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమి ఇస్తే తాము ఉపాధి కోల్పోతామని, తమ మనుగడే ప్రశ్నార్థకంగా ఉంటుందని తెలిపారు. భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులకు చుక్కలు చూపిస్తున్న రైతులు
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు భూసేకరణ చేపడుతున్న అధికారులకు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. భూములను గుర్తించే క్రమం నుంచి రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. తమ పంట భూములను తీసుకోవద్దంటూ రైతులు భూసేకరణ అధికారులకు మొరపెట్టుకుని ఒకానొక దశలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలకు కూడా ప్రయత్నించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావస్తున్నప్పటికీ భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. దీంతో నాలుగో నగరం ఆరంభంలోనే అడ్డంకులెదురవుతున్నాయి.