యాచారం, జూన్8: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను తరలిస్తున్నారు. మేడిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఈ పీఎస్‌ను ఇప్పుడు కుర్మిద్దకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.
గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ పరిధిలోని యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు భద్రతను కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 జూన్‌లో ఒక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. అనుకున్నదే తడవుగా అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో రాచకొండ కమిషనర్ సమక్షంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 20 గ్రామాలు, వాటి అనుబంధ గ్రామాలను కలుపుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో అద్దె భవనంలో ”హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా”ను ఏర్పాటు చేసింది. సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, 20 మంది పోలీస్ సిబ్బందిని నియమించింది. అయితే దీన్ని కుర్మిద్దకు తరలించాలని అధికార యంత్రాంగం తాజాగా నిర్ణయించింది. కందుకూరు, కడ్తాల్ మండలంలోని దూర ప్రాంత ప్రజలకు అనుకూలంగా, అన్నివేళల్లో అందుబాటులో ఉండేందుకు ఠాణాను కుర్మిద్దకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
త్వరలో ఫార్మా పీఎస్ తరలింపు..
మేడిపల్లి గ్రామంలో ఉన్న పీఎస్ కందుకూరు మండల ప్రజలకు దూరం కావడంతో అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని గ్రామాలకు మధ్యలో ఉండేలా పోలీస్ స్టేషన్‌ను కుర్మిద్ద గ్రామానికి తరలిస్తున్నారు. గతంలో కుర్మిద్దలోని ఓ అద్దె భవనంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. అదే భవనంలోకి ఇప్పుడు ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌ను మారుస్తున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కు సంబంధించి మరమ్మతు పనులు పూర్తి చేపట్టారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఆ వెంటనే కుర్మిద్దకు ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌ను మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మేడిపల్లి నుంచి పోలీస్ స్టేషన్‌ను తరలించవద్దని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీఎస్ పరిధిలోకి 19 గ్రామాలు
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలకు చెందిన 19 గ్రామపంచాయతీలు వాటి అనుబంధ గ్రామాలు రానున్నాయి. యాచారం మండలం నుంచి మేడిపల్లి, నక్కర్త, నానక్‌నగర్, పిల్లిపల్లి, తాటిపర్తి, గొల్లగూడ, కుర్మిద్ద, మర్లకుంటతండా, కందుకూరు మండలం నుంచి సాయిరెడ్డిగూడ, ముచ్చర్ల, ఉట్లపల్లి, మీర్ఖాన్పేట, ఆకులమైలారం, పంజాగూడ, మాలగూడ, బేగరికంచె, సార్లరావులపల్లి, సార్లరావులపల్లి తండా, బండమీదితండా, గుట్టలతండా, పోచమ్మగడ్డతండా, పోతుగడ్డతండా కడ్తాల మండలం పల్లెచెల్కతండాలను ఎంపిక చేశారు.