రంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యే వీఐపీలు, అధికారులు, మీడియా, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు , పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనుల్లో వేగం పెంచాలి
వికారాబాద్, ఆగస్టు 12 : అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం జిల్లా సమాఖ్య అధ్యక్షులతో ఆయన సమావేశమై బడుల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మండలాలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధులు దుర్వినియోగం కాకుండా పనులు చేయించాలని ఆదేశించారు.
మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలవారీగా వసతుల కల్పనకు వెచ్చించిన నిధుల వివరాలను పంపించాలన్నారు. అనంతరం స్కూళ్లకు అందజేయాల్సిన లైట్లు, ఫ్యాన్లను పరిశీలించారు. సమావేశంలో డీఆర్డీఏ శ్రీనివాస్ , అడిషనల్ డీఆర్డీవో సరోజ , జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, ఐకేపీ సమాఖ్య అధక్షులు పాల్గొన్నారు.