రంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు నిధులు లేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో సిబ్బంది జీతభత్యాలు తప్ప.. ఏ ఇతర పనులకూ నిధులు రావడంలేదు. మౌలిక సదుపాయాలకు కూడా ప్రజలు దూరమవుతున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకాధికారులు గ్రామాలవైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. దీంతో గ్రామపంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపైనే పడింది.
దీంతో కార్యదర్శులు కనీస సౌకర్యాలు కల్పించడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసిన అప్పులు తీర్చడానికి ట్రెజరీలు బిల్లులు పాస్చేయడంలేదు. దీంతో కార్యదర్శులు సైతం అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, డ్రైనేజీలు క్లీన్ చేయటం, చెత్త సేకరణ, హరితహారం మొక్కల నిర్వహణ, పల్లె ప్రకృతివనాల నిర్వహణ వంటివాటికి కూడా నిధులు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాపాలన స్తంభించిపోయింది.
గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసి సుమారు ఏడాది దాటిపోయింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడం వలన గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రత్యేకాధికారుల పాలనలోనే ఏడాది దాటిపోయింది. గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ప్రణాళిక నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులు కూడా రావడంలేదు. ఈ నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగేవి. నిధులు రాకపోవడం వలన గ్రామాల్లో పనులు ముందుకు సాగడంలేదు.
గ్రామపంచాయతీల నిర్వహణ బాధ్యత కోసం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను ఏర్పాటుచేసింది. కాని, ప్రత్యేకాధికారులు మాత్రం గ్రామాలవైపు కన్నెత్తి చూడడంలేదు. ప్రత్యేకాధికారులు ఆయా శాఖల్లో పని ఒత్తిళ్లతో గ్రామాలవైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో గ్రామాల నిర్వహణ బాధ్యత పూర్తిగా కార్యదర్శులపైనే పడింది. తరచుగా పైపులైన్ల లీకేజీ, వీధి దీపాలు పాడైపోవడం వంటివి జరుగుతున్నాయి. పైపులైన్ల మరమ్మతులకు, వీధి దీపాల కోసం కార్యదర్శులే అప్పులు చేసి మరమ్మతులు చేయిస్తున్నారు. కాని, వారు చేసిన అప్పులు తీర్చడం కోసం పంచాయతీ నిధుల నుంచి తీసుకోలేకపోతున్నారు. దీంతో కార్యదర్శులంతా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గ్రామపంచాయతీలకు నిధుల కొరత కారణంగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలేదు. ముఖ్యంగా రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం వలన ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులంటూ లేకపోవడంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడంలేదు. ఎమ్మెల్యే నిధుల నుంచి వచ్చే కొద్దిపాటి నిధులు తప్ప ఏ ఇతర నిధులు రావడంలేదు. బీఆర్ఎస్ పాలనలో అవార్డులందుకున్న గ్రామాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి సాధించాయి. గ్రామాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కింద సుమారు జిల్లాలో 20కిపైగా గ్రామాలు అవార్డులు అందుకున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామాలు కూడా నిధులులేక ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి.
ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించి ట్యాక్సీల వసూళ్లను కార్యదర్శులు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమచేస్తున్నారు. ఖాతాల్లో జమచేసిన డబ్బులు తిరిగి చెల్లించవద్దని ప్రభుత్వం ట్రెజరీలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ట్రెజరీలు కేవలం పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు తప్పా ఏ ఇతర బిల్లులకు కూడా చెల్లింపులకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ కూడా భారంగా మారింది. దీంతో పలుచోట్ల ట్రాక్టర్లు డీజిల్ లేక మూలనపడ్డాయి. అలాగే, గత ఆరునెలలుగా పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించకపోవడంతో వారు కూడా ఆందోళన బాట పడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కాని, ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గ్రామపంచాయతీల నిర్వహణ కూడా కార్యదర్శులకు భారంగా మారింది. రోడ్లపై మురుగునీరు పారడం, దోమల స్వైర విహారంతో పాటు మరిన్ని సమస్యలతో ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన రీతిలో సాగుతున్నది. చేతకాని ముఖ్యమంత్రితో రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది.
– ఏనుగు భరత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ
గ్రామపంచాయతీ సిబ్బందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సకాలంలో వేతనాలు అందించడంలేదు, ఎన్నికల ముందు పంచాయతీ సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సకాలంలో వేతనాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టించుకోవడంలేదు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి సుమారు ఆరు నెలల నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.
– పోచమోని కృష్ణ, సీఐటీయూ నాయకుడు