కేశంపేట, నవంబర్ 7 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పది నెలల పెండిం గ్ వేతనాలు అందకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పి గత ఐదేండ్లుగా పట్టించుకోవడంలేదని ప్రభు త్వం తీరుపై మండిపడుతున్నారు. తాము గ్రామాల ప్రగతికోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని.. సమయానికి బిల్లులు రాకు న్నా అప్పులు చేసి పల్లెల రూపురేఖలు మారుస్తున్నామని గుర్తు చేస్తున్నారు.
ఉమ్మ డి రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా రెండు వందల వరకు పంచాయతీ కార్యదర్శులు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని.. పది నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాల్సిన అవుట్ సో ర్సింగ్ పునరుద్ధరణ జీవోను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు రాలేదని, ప్ర స్తుత ఏడాది ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన జీవో నూ విడుదల చేయకపోవడంతో 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలను చెల్లించలేదన్నారు.
పాలకుల వైఖరితో రాష్ట్రంలో ఉన్న 1,037 మంది పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి 2020లో పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగం పొందిన తమను క్రమబద్ధీకరించడంతోపాటు పెండింగ్లో ఉన్న పది నెలల వేతనాలను చెల్లించాలని రెండు జిల్లాల పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.