కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు, దివ్యాంగులు, ఆశ వర్కర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళనలు కొనసాగుతుండగా పంచాయతీ కార్మికులు సైతం రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు వరాల జల్లులు కురిపించిన రేవంత్ సర్కార్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు మండల కార్యాలయాల ఎదుట టోకెన్ సమ్మెకు దిగారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ)
పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేసి, కనీస వేతనం రూ.19వేలు చెల్లించాలి కారోబార్, బిల్కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి జీవో నెంబర్ -51ను వెంటనే సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాంట్ కేటాయించి పీఆర్సీలో అర్హులుగా గుర్తించాలి
ప్రతి కార్మికుడికీ రూ.5లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేయాలి విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.19వేలు చెల్లించాలి. జీవో నంబర్ -51ను వెంటనే సవరించి కార్మికులను ఆదుకోవాలి. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామపంచాయతీల్లో సేవలు అందించే కార్మికులను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోవడం బాధాకరం.
– బుగ్గ రాములు, సీఐటీయూ మండల కన్వీనర్
గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి ఆశ చూపిండ్రు. మా బతుకులు బాగుపడుతమనుకున్నం. అధికారంలోకి వచ్చాక మావైపు కన్నెత్తి చూడడం లేదు. చాలిచాలనీ జీతాలతో మా కుటుంబాలను సాదుకోవడం ఎలా..?.. మార్కెట్లో అన్ని ధరలు పెరిగాయి.. మా జీతాలను పెంచండి సారూ..
– రమేశ్, పంచాయతీ కార్మికుడు