ధారూరు, జూన్ 9 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్తూ బైక్ పై నుంచి కింద పడి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ధారూరు పోలీసుల కథనం ప్రకారం.. బొంరాస్‌పేట మండలంలోని దేవులనాయక్‌తండాకు చెందిన సుమిత్రాబాయి (32) యాలాల మండలంలోని అచ్యుతాపురం గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు భర్త నెహ్రూనాయక్‌తో కలిసి బైక్‌పై వికారాబాద్‌కు వెళ్లింది. ఎగ్జామ్ అనంతరం తాండూరుకు తిరిగి వెళ్తుండగా గట్టేపల్లితండా సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడడంతో తలకు తీవ్రమైన గాయాలై మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు.
బొంరాస్‌పేట : ధారూరు మండలంలోని గట్టేపల్లితండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొట్లవానితండా పంచాయతీ పరిధిలోని దేవులనాయక్‌తండాకు చెందిన సుమిత్రాబాయి మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొన్నది. సుమిత్ర కుటుంబంతో కలిసి తాండూరులో ఉంటూ.. అచ్యుతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులకు హాజరవుతున్నది.
ఆదివారం జరిగిన గ్రూప్-1 పరీక్షకు భర్తతో కలిసి వికారాబాద్‌కు బైకుపై వెళ్లింది. తిరిగి తాండూరుకు వస్తుండగా గట్టేపల్లితండా సమీపంలో బైకుపై నుంచి ఆమె కింద పడడంతో తీవ్ర గాయాలై మృతిచెందింది. భర్త నెహ్రూనాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నెహ్రూనాయక్ బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడిగా, మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్జిగా పనిచేస్తున్నాడు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే కొడంగల్ తాలూకా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు తాండూరు దవాఖానకు వెళ్లి నెహ్రూనాయక్‌ను పరామర్శించారు.