తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలని, అందుకోసం పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. బుధవారం ఖైరతాబాద్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేశ్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పెట్టగా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్‌లతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, తలకొండపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్ జడ్పీటీసీలు బలపర్చి మద్దతు తెలుపగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పంజాబ్‌కు ఓ న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా.. అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏదేమైనా వందశాతం ధాన్యం కొనాల్సిందేననన్నారు.
రంగారెడ్డి, మార్చి 30, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతులు పండించిన ప్రతీ గింజను కేంద్రం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసే వరకూ పోరాడుదామని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడారు. పంజాబ్‌కు ఓ న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా.. పంజాబ్, హర్యానా తరహాలోనే ధాన్యాన్ని సేకరించకుండా కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడుదామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేశ్ తీర్మానాన్ని జడ్పీ సర్వసభ్య సమావేశంలో పెట్టగా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్‌లతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, తలకొండపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్ జడ్పీటీసీలు బలపర్చి మద్దతు తెలుపగా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీఈవో సుశీంద్రరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్ రెడ్డి, డీఆర్డీవో ప్రభాకర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
డీపీవో తీరుపై కలెక్టర్ అసంతృప్తి..
జిల్లాలో గ్రామపంచాయతీల్లో అక్రమ నిర్మాణాలు, ఇంటి అనుమతులకు సంబంధించి జడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉంటున్న ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించుకుంటే పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పెట్టడంపై కలెక్టర్ డి.అమయ్‌కుమార్ జిల్లా పంచాయతీ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు ఒక న్యాయం, ఉన్నోళ్లకు ఒక న్యాయమా అంటూ కలెక్టర్ నిలదీశారు. అక్రమ నిర్మాణాలని గుర్తిస్తే నిర్మాణం ప్రారంభంలోనే కూల్చాలని, కానీ పంచాయతీ కార్యదర్శులు నిర్మాణం సగానికిపైగా పూర్తైన తర్వాత కూల్చి పేదలకు నష్టం కలిగిస్తున్నారన్నారు.
మొయినాబాద్ మండలంలో ఓ పేద కుటుంబం ఎప్పటి నుంచో ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరిందని, తిరిగి కడుతుంటే కూలగొట్టారని, అదే 111 జీవో పరిధిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలిసినా పట్టించుకోకపోవడం ఏంటని డీపీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టే ముందు ఆలోచించాలని కలెక్టర్ అమయ్‌కుమార్ సూచించారు. గ్రామాల్లో ఉన్న ఇండ్లను తిరిగి కట్టుకోవడానికి కూడా అనుమతులు అవసరమా అని అన్నారు. ఇల్లు నిర్మాణం ప్రారంభించినప్పుడు ఎవరూ ఆపరు, 80 శాతం నిర్మాణ పనులు పూర్తైన తర్వాత కూలగొట్టడం సరికాదని, అనుమతులిచ్చే ముందే చూసుకోవాలని ఆదేశించారు.
పంజాబ్, హర్యానా తరహాలో ధాన్యాన్ని సేకరించాలి
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. పంజాబ్, హర్యానా తరహాలో ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్ని ప్రాజెక్టుల్లో, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతోపాటు భూగర్భజలాలు పెరగడంతో వరి సాగు భారీగా పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుబంధు, రైతుబీమా, 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు వంటి కార్యక్రమాలను అమలుచేస్తుందన్నారు. రైతుబంధు పథకం ఇతర రాష్ర్టాలకు దిక్సూచిలా మారిందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంతో తెలంగాణలో తాగునీటి సమస్య తీరిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆహారభద్రత చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తుంది..
ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం ఆహారభద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రైతులకు జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. కేంద్రం బాధ్యత వహించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరందించాలని ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీరందించడంతో గతంలో వలసపోయిన పాలమూరు ప్రజలు తిరిగి జిల్లాకు వచ్చారన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం మొండికేయడం సరికాదన్నారు. అంతేకాకుండా వరి సాగులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానానికి చేరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్రం మొండికేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.
-జైపాల్ యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే