వికారాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మా ర్కెట్‌కు తరలుతున్నది. కోతలు పూర్తై ధాన్యాన్ని కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఆందోళన చెందిన రైతులు తక్కువ ధరకే విక్రయిస్తూ నష్టపోతున్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినా..మెజార్టీ కేంద్రాల్లో ఇంకా కంటానే వేయలేదు. కొన్ని కేంద్రాలోనే కొనుగోళ్ల ప్రక్రి య ప్రారంభం కాగా.. ఇప్పటివరకు కేవలం 30 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. ప్రతి ఏటా యాసంగిలో ఏప్రిల్ 20లోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని సేకరించేవారు. కాగా, ఈ ఏడాది మాత్రం దాదాపు నెల రోజులు ధాన్యం సేకరణలో జాప్యం జరిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి గత 20 రోజుల కిందటే కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయినా.. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కేంద్రాలను ప్రారంభించేందుకు జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వదిలేయడంతో రైతులు అకాల వర్షాల భయానికి తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు. వరి సాగు చేసిన రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితులుండడంతో రైతులు ఆందోళన పడుతున్నారు.
సేకరణలో తీవ్ర జాప్యం..
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం..మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గ్రామగ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో అన్నింటిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. కేసీఆర్ హయాం లో వరి కోతకు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించేవారు. జిల్లాలో యాసంగి కోతలు పూర్తై గత పది రోజులుగా పడిగాపులు కాస్తున్నా రైతుల నుంచి మాత్రం ధాన్యాన్ని సేకరించడంలేదు. రైతులు కోతలను పూర్తి చేసి కల్లాలు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ఎప్పుడెప్పుడు ప్రభు త్వం కొంటుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ యాసంగిలో లక్షా5 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా, వాటిలో ఐకేపీ ద్వారా 42, పీఏసీఎస్ ద్వారా 49, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా రైతులకు క్వింటాకు ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369లుగా మద్దతు ధర లభించనున్నది. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500ల బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు 30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో ఇప్పటివరకు 30 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రెండు, మూడు రోజుల్లో అన్ని కేంద్రాల్లోనూ తూకం వేసేలా చర్యలు తీసుకుంటాం . ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులనూ అందుబాటులో ఉంచు తాం. జిల్లాకు 27 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 19 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
– మోహన్‌కృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్