సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడం, మరోవైపు గ్రామపంచాయతీల్లో పాలన చూడాల్సిన ప్రత్యేకాధికారులు పత్తా లేకుండా పోవడంతో పాలన పడకేసింది. జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీల్లో పర్యటించేందుకు వస్తే తప్ప ప్రత్యేకాధికారులు రావడంలేదని ప్రజలు చెబుతున్నారు. కనీసం వారానికి ఒక్కరోజు కూడా గ్రామాలకు ప్రత్యేకాధికారులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామపంచాయతీలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామపంచాయతీలుగా రూపుదిద్దుకున్న గ్రామపంచాయతీల్లోనూ కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి పడకేసింది. గ్రామపంచాయతీలకు నయా పైసా నిధులివ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రత్యేకాధికారులను నియమించారే తప్ప కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. వేసవికాలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానికంగా చిన్నచిన్న కాంట్రాక్టర్లతో చేయించిన మరమ్మతు పనులకు సంబంధించిన రూ.4 కోట్ల నిధులు కూడా ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలు దేశంలోనే ఆదర్శంకాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. గతేడాదిగా పంచాయతీ కార్మికులకు జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు లేక పాలనకు దూరం
ప్రత్యేకాధికారులుగా నియమించిన తర్వాత నెలరోజులపాటు వెళ్లిన ప్రత్యేకాధికారులు తదనంతరం గ్రామపంచాయతీల్లో నయా పైసా నిధులు కూడా లేకపోవడంతో గ్రామపంచాయతీలకు పోవడం మానేశారనే అభిప్రాయం ప్రత్యేకాధికారుల నుంచి వ్యక్తం అవుతున్నది. గత వేసవి సమయంలో గ్రామపంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మరమ్మతుల పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లులే రాకపోవడంతో ప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీలవైపు చూడడం లేదనే వాదన వినిపిస్తున్నది. అదేవిధంగా జిల్లాస్థాయి మొదలుకొని మండల స్థాయి వరకు అన్ని శాఖల అధికారులను గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఆయా శాఖల్లోని రెగ్యులర్ పనులతోపాటు ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రత్యేకాధికారి పనులను కూడా నిర్వహించాల్సిన పరిస్థితి. ఒక్కో అధికారికి రెండు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా నియమించిన జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండలాల్లోని అటు చివర, ఇటు చివర ఉండే గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించడం కూడా సమస్యగా మారింది. మరోవైపు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయనుకుంటే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తుండడంతో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేది స్పష్టత లేకుండా పోయింది.
పారిశుధ్యం అస్తవ్యస్తం
డ్రైనేజీ పైప్‌లైన్‌కు కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొనడంతో గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్దంలా మెరిసిన రోడ్లు ప్రస్తుతం మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో దయనీయ పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు వ్యాధులు ప్రబలుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ గ్రామానికి ఇచ్చిన ట్రాక్టర్లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐ కట్టలేని పరిస్థితితోపాటు ట్రాక్టర్ల నిర్వహణకు కనీసం డీజిల్‌కు కూడా డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లు మూలన పడడంతో ఇంటింటికెళ్లి తడి-పొడి చెత్త సేకరించే ప్రక్రియ కూడా గ్రామాల్లో నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండిపోయింది.