శంషాబాద్ రూరల్, ఆగస్టు 31: ‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టి లేకపోవడం విడ్డూరంగా ఉన్నది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బాగాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హాస్టల్‌ను మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘హాస్టల్లో మా పిల్లలు ఇబ్బందులుపడుతున్నారు.
మీరే చూడాలి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా, స్పందించిన హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి.. ‘మీకు మేమున్నాం.. మీకేం కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా గాడితప్పింది. విద్యార్థులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతున్నది’ అని అన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. మాకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనంతరం హాస్టల్లో వండుతున్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కిలోమీటర్ దూరం వెళ్లి.. రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడ ఉన్నదో అర్థమవుతున్నదన్నారు. కులం పేరుతో దూషిస్తున్నట్లు విద్యార్థులు కన్నీరుపెట్టుకోవడం బాధాకరమన్నారు.
ఏదైనా అడిగితే కర్రలు విరిగేలా కొడుతున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఓ విద్యార్థి టీచర్ కొట్టిన దెబ్బలకు గాయమైన చేతిని చూపుతూ.. ఏడుస్తున్న తీరు కలిచివేసిందన్నారు. ‘ఇప్పటివరకు కేవలం ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. మరో జత అడిగితే ఇవ్వడం లేదు. పుస్తకాలు సైతం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, కస్తూర్బాగాంధీ హాసళ్లపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది’ మాజీ మంత్రులు విమర్శించారు.
కేసీఆర్ పాలనలో సన్నబియ్యంతో అన్నం పెడితే..
గతంలో కేసీఆర్ పాలనలో సన్నబియ్యంతో అన్నం పెడితే.. మీరు గొడ్డుకారం పెడుతున్నారు’ అని హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ గురుకులాలకు చెందిన 500 మంది దవాఖాన పాలయ్యారు. 38 మంది పిల్లలు చనిపోయారు. పాములు కరిచి చనిపోతున్నారు. ఎలుకలు కొరికి దవాఖానల్లో చేరుతున్నారు. ఒకప్పుడు గురకులాల్లో చదవడం కల.. ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. హాస్టల్ విద్యార్థులపై కించపరిచేలా మాట్లాడటం సరికాదు. పిల్లలు భయపడుతున్నారు.
ఇక్కడ ఉన్న టీచర్లను మార్చి కొత్తవారిని తీసుకొచ్చి.. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. విద్యాశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. మైనార్టీ గురుకులాలకు జనవరి నుంచి మెస్ బిల్లులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కాస్మోటిక్ చార్జీలు, కరెంట్ బిల్లలు ఇవ్వలేదు’ అని ఇప్పటికైనా సీఎం పాలనపై దృష్టి పెట్టి సమీక్షలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్‌ను సందర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ సతీశ్ తదితరులు ఉన్నారు.
మా పిల్లలను వేధించడం తగదు
మా పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే వేధింపులకు గురి చేయడం సరికాదు. దుస్తులు ఇవ్వకపోవడం ఏమిటి ? ఇది హాస్టల్ సిబ్బందికి భావ్యం కాదు. మంచి అన్నం పెట్టమంటే కులం పేరుతో దూషించడం ఏమిటి ? గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు.
– లావణ్య, విద్యార్థిని తల్లి
మా పిల్లలకు ఏం జరిగినా..
మా పిల్లలకు ఏం జరిగినా ఉపాధ్యాయులదే బాధ్యత. మేం పేదోళ్లం అందుకే హాస్టల్లో వేసినం. మా కులం పేరుతో దూషించడం సరైన పద్ధతి కాదు. చదువుకున్నోళ్లు అనే మాటలేనా.. ఉపాధ్యాయులను పూర్తిగా మార్చివేసి.. మా పిల్లలకు న్యాయం చేయాలి.
-కుమార్, విద్యార్థిని తండ్రి
స్టాఫ్‌ను పూర్తిగా మార్చినం
హాస్టల్లో విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలంటూ.. ఆందోళనకు దిగిన విషయం తెలుసుకొని వెంటనే డీఈవో సుశీంధర్‌రావు హాస్టల్‌ను సందర్శించి.. మాకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో స్టాఫ్‌ను పూర్తిగా మార్చినం.
– సుజాత, జీసీడీవో (గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్)