వికారాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులకు రైతులు ఎదురు తిరిగిన ఘటన అనంతరం పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నా తాము మాత్రం భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. మేం ఓటేసి గెలిపిస్తే సీఎం అయిన రేవంత్రెడ్డి వచ్చి మమ్మల్ని చంపేసినా భూములివ్వబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు. లగచర్ల ఘటన అనంతరం దాడి చేసిన వారి కోసం అర్ధరాత్రి సమయంలో గాలింపు చేపట్టిన పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
కరెంట్ సరఫరా నిలిపివేసి, ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి ఇల్లిల్లూ జల్లెడపట్టారు. చిన్నారులు, మహిళలు అని చూడకుండా అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఇండ్లలోకి వెళ్లిన పోలీసులు ఎవరూ లేరని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. అధికారులకు ఎదురుతిరిగిన ఘటనలో పాల్గొన్న రైతులు గ్రామంలో లేకపోయినా ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు మహిళలు, చిన్నారుల పట్ల దురుసుగా ప్ర వర్తించడంపై రైతు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాతల కాలం నుంచి భూములపై ఆధారపడి జీవిస్తున్నామని.. ఇప్పుడు కంపెనీల కోసం భూములిచ్చి తాము ఎలా బతకాలని రైతులు నిలదీస్తున్నారు. ఫార్మా విలేజ్కు భూములిచ్చే ప్రస క్తే లేదని, మమ్మల్ని చంపి భూములను తీసుకోండని తెగేసి చెబుతున్నారు. తమ భూములను లాక్కుంటే ఎంతకైనా తెగిస్తా మని స్పష్టం చేస్తున్నారు. రైతుల మనోవ్యథను గుర్తించి పునరాలోచించాలని, ఇంకా పోలీసులతో భయపెట్టాలని చూడొద్దని రైతులు తాము ఓటేసి గెలిపించుకున్న సీఎంను డిమాండ్ చేస్తున్నారు.
హకీంపేట, పోలేపల్లి, లగచర్లతోపాటు తండాల రైతులందరం కలిసి తమ బతుకులు ఆగమవుతాయని గత పది నెలలుగా అన్ని పనులు వదులుకొని ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం. తాతల కాలం నుంచి ఈ భూములే మమ్మల్ని బతికిస్తున్నాయి. ఈ భూములను సర్కారు తీసుకుంటే మా బతుకులు ఆగమవుతాయి. వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేస్తున్నాం. మరోవైపు లగచర్ల ఘటన అనంతరం ఫార్మా విలేజ్ ఏర్పాటుపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని భూములు కోల్పోతున్న గ్రామాలు, తండాల రైతులు భావించినా.. ప్రభుత్వం మాత్రం ఫార్మా విలేజ్ ఏర్పాటు దిశగా ముందుకే వెళ్తున్నది. సీఎం సోదరుడు లగచర్లతోపాటు మిగతా గ్రామాల్లో పర్యటించి ఫార్మా కంపెనీల కోసం భూ ములివ్వాల్సిందేనని చెబుతుండడంపై ఆయా గ్రామాల రైతులు సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర సర్కారుపై మండిపడుతున్నారు.
పుట్టినప్పటి నుంచి ఈ భూమిని నమ్ముకునే బతుకుతున్నా. చదువులేదు, ఉద్యోగం చేయలేను. గిప్పుడు ఈ ఫార్మా కంపెనీలతో మా భూములు పోతాయని అంటుండ్రు. అవే పోతే మా బతుకులు ఎట్టా.. ఏం చేసుకొని బతకాలి. ఎక్కడ పోయి బతకాలి. అందుకే భూములివ్వం. మాలాంటి చిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి.. రోడ్డున పడేస్తే.. ఎట్లా..? మా పొలాలు మాకు కావాలి.. నోటికాడి కూడు లాక్కోవద్దు. – హర్యానాయక్, గలచెర్ల, దుద్యాల మండలం
లగచర్ల ఘటన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితారెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలంతా తప్పుపడుతున్నారు. లగచర్ల ఘటనలో అధికారులకు వ్యతిరేకంగా రైతులు తిరగబడిన విషయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలను ఇరికించే కుట్ర చేస్తున్నదని మండిపడ్డా రు. పోలీసులు సరైన విచారణ చేయకుండానే ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసుకొని చెబుతున్న ప్రకారం కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.