దాదాపు నెలన్నర రోజులపాటు వేసవి సెలవులు పూర్తికావడంతో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, మరుగుదొడ్లు, కంపౌండ్ వాల్స్, విరిగిపోయిన తరగతి గదుల తలుపులు, కిటికీలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా సర్కారు బడులు దర్శనమిస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే మౌలిక సదుపాయాలను కల్పించే అంశాలతోపాటు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతలను విద్యాశాఖ అధికారులు విస్మరించారు.
బుధవారం పొద్దుపోయే వరకు కూడా స్కూళ్లు చెత్తాచెదారం, దుమ్మూధూళితో ఎక్కడిక్కడ దర్శనమిస్తుండడం గమనార్హం. గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా విద్యార్థులకు తొలిరోజు పాఠాల బోధనకు బదులు వారితో పాఠశాలలను శుభ్రం చేయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణంతోపాటు పెచ్చులు ఊడిపడే ప్రమాదమున్న స్కూళ్లకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.
– వికారాబాద్/ రంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడిలో భాగంగా పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మన ఊరు-మన బడి కింద చేపట్టిన స్కూళ్లను పక్కన పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టి వేరే స్కూళ్లను ఎంపిక చేసి పనులు చేపట్టింది. మన ఊరు-మన బడి కింద జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 371 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు మొదలుపెట్టగా.. కేవలం 20 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయి ప్రారంభానికి నోచుకున్నాయి. మిగతా స్కూళ్లలో 30 శాతం పనులు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఊరు-మన బడిని పక్కన పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకురావడంతో మన ఊరు-మన బడిలో చేపట్టిన పనులు ఎక్కడిక్కడ గతేడాదిన్నరగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన స్కూళ్లలోనూ నిధులు లేకపోవడంతో పనులు చాలా స్కూళ్లలో అసంపూర్తిగానే ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విద్యాశాఖపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సంబంధిత అధికారులు కూడా ఈ ఏడాది బడి బాట కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహించి ముగించారు. కేవలం అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మినహా కొత్తగా విద్యార్థులెవరూ చేరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 1060 ప్రభుత్వ పాఠశాలలుండగా, 80 వేల మంది విద్యార్థులున్నారు.
సమస్యలు పరిష్కారం కాకుండానే..
రంగారెడ్డిజిల్లాలో 1,336 పాఠశాలలుండగా.. సుమారు 1,38,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలను బలోపేతం చేసి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావించినప్పటికీ నిధుల లేమితో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చినా.. అన్ని మౌలిక వసతులు కల్పించడంతోపాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలుకావడంలేదు. కాగా.. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాని పాఠశాలలకు ఇప్పటివరకు చేరలేదు.