వికారాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం కానుండగా.. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాశ్వత భవనం పూర్తికి రెండేండ్ల సమయం పట్టే అవకాశమున్న దృష్ట్యా అధికారులు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పనులు తుదిదశకు చేరుకోగా.. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, తరగతుల నిర్వహణ, వసతి గృహాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. అదేవిధంగా వికారాబాద్ ప్రభుత్వ దవాఖానను మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాస్పత్రిగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయడంతో.. ఈ దవాఖాన పనులనూ వచ్చే నెలలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, దవాఖాన అప్‌గ్రేడ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.235 కోట్లను కేటాయించింది. బోధనాస్పత్రి అందుబాటులోకి వస్తే జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. ఐసీయూ, ట్రామా కేర్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పీహెచ్‌సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారనున్నాయి.
జిల్లాలో వైద్య విద్యకు మహర్దశ పడుతున్నది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వే స్తున్నది. అయితే వికారాబాద్ జిల్లాకు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే విద్యా సంవ త్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాల శాశ్వత భవన నిర్మా ణం రెండేండ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అనంతగిరిలోని టీబీ శానిటోరియం లో తాత్కాలికంగా తరగతులను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పాటు తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ఈనెలాఖరు వరకు టీబీ శానిటోరియంలో మెడికల్ కళాశాల తరగతులను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు వసతి గృహాలు తదితర వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరమ్మతులు తుది దశకు చేరుకున్నాయి. 15రోజుల్లో పనులు పూర్తి చేసేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు…
వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుబంధ బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీ అనుబంధ బోధనాస్పత్రిని మరో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అ యితే వికారాబాద్‌లో 100 పడకల ఏరియా ఆస్పత్రిని 380 పడకలతో బోధనాస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.30 కోట్లతో ఏరియా ఆస్పత్రిపై మరో రెండంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే బోధనాస్పత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే 100 సీట్లతో జిల్లాకు ప్రభు త్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆస్పత్రి అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
పీహెచ్‌సీలు ఇక నుంచి సీహెచ్‌సీలుగా..
అలాగే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. సాధారణ వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవల కోసం తప్పనిసరిగా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా, ఇతర అత్యవసర వైద్య సేవలు పొందాలంటే హైదరాబాద్‌లోని ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లేలోపే మార్గ మధ్యంలోనే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అదే జిల్లాలోనే మెడికల్ కళాశాలతోపాటు బోధనాస్పత్రి అందుబాటులోకి వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయి. అత్యాధునిక వైద్య చికిత్సలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
జిల్లా ప్రజలకు సత్వర, నాణ్యమైన వైద్యసేవలు…
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసిన దృష్ట్యా ప్రస్తుతం ఉన్న వికారాబాద్ ఏరియా ఆస్పత్రిని 380 పడకల బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కళాశాల ఏర్పాటుతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం 12 రకాల వైద్య సేవలు కొనసాగుతున్నాయి. బోధనాస్పత్రి అందుబాటులోకి వస్తే 20కిపైగా వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రెండు, మూడు నెలల్లో జిల్లా ప్రజలకు బోధనాస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. అలాగే ఐసీయూ, ట్రామా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికే రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నిషీయన్, స్టోర్ కీపర్, చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నిషీయన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఆడియో మెట్రి టెక్నిషీయన్, అప్టీషియన్, థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, బ్లడ్‌బ్యాంక్ అధికారి పోస్టులను మంజూరైన దృష్ట్యా సంబంధిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రెండేండ్లలో అందుబాటులోకి…
వికారాబాద్‌లో శాశ్వత మెడికల్ కళాశాల భవనాన్ని రెండేండ్లలోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కళాశాల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో అనువైన స్థలాలను జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వీటిలో అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కళాశాల సమీపంలోని బిల్లా దాఖలా స్థలాల వివరాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేసింది. అయితే కళాశాల ఏర్పాటుకు అనంతగిరిలోని వైద్యారోగ్య శాఖకు సంబంధించిన టీబీ శానిటోరియం స్థలాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. రెండేండ్లలోగా ఈ స్థలంలోనే కళాశాల భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు.