ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దింది. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఊరు – మన బడి పేరును మార్చి ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలుగా నామకరణం చేసింది. కాని, చేతల్లో మాత్రం ఏమాత్రం ఆదర్శం కనిపించడంలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించడంలేదు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల అభివృద్ధితోపాటు రంగులు వేయించే కార్యక్రమం చేపట్టారు. వాటికి కూడా ఇప్పటివరకు బిల్లులు ఇవ్వడంలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నప్పటికీ వసతులు కల్పించకపోగా.. వాటికి రంగులు కూడా వేయడంలేదు. పేరు మార్చిన ప్రభుత్వం పాఠశాలల పనుల పురోగతి శూన్యమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో సుమారు 1300 వరకు ప్రభుత్వ పాఠశాలలుండగా.. సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పాఠశాలలకు రంగులు వేయడంకోసం ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించింది. ఇందులో ఫేజ్-1 కింద 487 పాఠశాలలను విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు రంగులు వేయడం కోసం ఎంపిక చేశారు. ఈ పాఠశాలలకు ఐదు మాసాల క్రితం కలర్లు కూడా తీసుకువచ్చి పాఠశాలల్లో అందుబాటులో ఉంచారు.
కాని, ఉన్నతాధికారులు పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. ఫేజ్-1 పనులకే దిక్కు లేదని.. ఇక ఫేజ్-2, ఫేజ్-3 పాఠశాలలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కారు బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేసి పాఠశాలలకు రంగులువేసి తీర్చిదిద్దాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించినా.. ఆ దిశగా పనులు జరగడంలేదు. జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం ఉన్నందున అంతకు ముందే పాఠశాలలో వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
మగ్గుతున్న రంగులు.. ఇవ్వని బిల్లులు
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఫేజ్-1లో ఎంపిక చేసిన బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వేసవి సెలవుల్లో పాఠశాలలకు రంగులు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా పనులు జరుగుతున్నప్పటికీ రంగారెడ్డిజిల్లాలో మాత్రం అధికారులు పనులు నిలిపివేశారు. ఎంపిక చేసిన పాఠశాలలకు రంగులు మార్చడం కోసం ఐదు నెలల క్రితం ఆయా పాఠశాలలకు తీసుకువచ్చారు.
కలర్లు తీసుకువచ్చి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేలోపే ఉన్నతాధికారుల నుంచి నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. దీంతో ఈ సంవత్సరం కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు మొక్కుబడిగానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారుచేశారు. పాఠశాలల్లో తాగునీరు, బ్లాక్‌బోర్డులు, టేబుళ్లు, కుర్చీలు వంటి వసతులతోపాటు వంట గదుల నిర్మాణం, పాఠశాలలకు రంగులు మార్చడం వంటి పనులు చేపట్టారు. సర్కారు మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేమంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీంతో లక్షల రూపాయలు పెట్టి పనులు చేయించిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మన ఊరు – మన బడి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడంతోపాటు కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పథకం పేరును అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చింది. కాని, వసతులపై దృష్టి సారించకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే ఆసక్తి చూపడంలేదు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి హాజరు శాతం పెంచాలి.
– రాజ్‌కుమార్, విద్యార్థి సంఘం నాయకుడు