షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 22: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చుతున్న ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ నాణ్యమైన బోధనతోపాటు పౌష్టికాహా రాన్ని అందిస్తున్నది. చిన్నారుల్లో పౌష్టికా హారం లోపం ఉండొద్దనే ఉద్దేశంతో సర్కారు బడుల్లో రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫరూఖ్‌నగర్ మండలంతోపాటు పట్టణంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలు మొత్తం 98 ఉన్నాయి. ఇందులో 9300 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా అమలవుతున్నది. కాగా ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఉదయం సమయంలో ఇంట్లో ఏమి తినకుండానే పాఠశాలల కు వస్తున్నారని వారిలో ఐరన్, న్యూట్రిషన్, విటమిన్ల లోపాలు తలెత్తకుండా ఉండేందుకు అల్పాహారంగా రాగిజావను సర్కార్ బడుల్లో పం పిణీ చేస్తున్నది. ఇది వారికి ఎంతో పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది
సంపూర్ణ ఆరోగ్యం కోసమే..
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం రాగిజావను పంపిణీ చేస్తున్నది. వారంలో మూడు రోజులు సోమ, బుధ, శనివారాల్లో ఉదయం 10 గంటలకు ఒక్కో విద్యార్థికీ 200మిల్లీమీటర్ల చొప్పున రాగిజావను అందిస్తుంది.
ఎంతో బాగుంది
ఉదయం పాఠశాలకు వచ్చిన తర్వాత రాగిజావను ఇస్తున్నారు. అది ఎంతో బాగున్నది. ఇంట్లో తినకుండా వచ్చిన మాకు రాగిజావ అల్పాహా రంగా ఉపయోగపడుతుంది. రుచికరమైన రాగిజావ ఇవ్వడం సంతోషంగా ఉంది.
-వైష్ణవి, 7వ తరగతి విద్యార్థిని, జిల్లా పరిషత్ పాఠశాల, షాద్‌నగర్
ఇష్టంగా తాగుతున్నాం..
ప్రభుత్వ పాఠశాలకు రాగానే వారంలో మూడు రోజులపాటు రాగిజావను పంపిణీ చేస్తున్నారు. నా స్నేహితులు, నేను ఎంతో ఇష్టంగా తాగుతున్నాం. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిదని ఉపాధ్యాయులు చెప్పారు.
-మురళీధర్, 6వ తరగతి విద్యార్థి, జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాల, షాద్‌నగర్