పరిగి : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరిగి ఎమ్మెల్యే టీ రాంమోహన్‌రెడ్డి ( MLA Rammohan Reddy) పేర్కొన్నారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల ఉచితంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఆధునిక సమాజంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో విరివిగా ఉపాధి, స్వయం ఉపాధి మార్గాలు అనేకం ఉన్నాయని తెలిపారు. గృహిణులు ఇలాంటి శిక్షణ పొంది ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఉందన్నారు. బీసీ, ఎస్టీ, మైనారిటీల వారికి సైతం ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆర్థిక అభివృద్దికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం భారత్-పాక్ మధ్య జరుగుతున్న దాడులలో మరణించిన సైనికుడు మురళినాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సైనిక కుటుంబాలకు అండగా ఉందామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో డిఫెన్స్ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీల చైర్మన్లు పరశురాంరెడ్డి, బిఎస్ ఆంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.