కడ్తాల్, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామంలో బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, టీఎస్ యూటీఎఫ్ జిల్లా-మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ దీటుగా అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, రాగి జావ అందజేస్తారని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, మండలాధ్యక్షుడు జంగయ్య, ఉపాధ్యక్షుడు మల్లయ్య, మహిళా అధ్యక్షురాలు కౌసల్య, సభ్యుడు నరసింహమూర్తి, భాగ్యలక్ష్మి, నాగరత్నం, ఎఫ్డబ్లూఎఫ్ కన్వీనర్ విజయ్‌కుమార్, నాయకులు జగన్, మహేశ్ తదితరులు ఉన్నారు.