పోచవరం గ్రామాన్ని ‘నమస్తే’ బృందం సందర్శించగా గ్రామస్తులు అనేక అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలు తమ దగ్గర లేవన్నారు. అభివృద్ధి విషయంలోనూ తెలంగాణ తర్వాతే మిగతా రాష్ర్టాలని వారు తమ అభిప్రాయం వెలిబుచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం రోజుకు 6 గంటలే కరెంటు సరఫరా చేస్తున్నదని పోచవరం గ్రామస్తులు తెలిపారు. ఒక వారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో వారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు సరఫరా ఉంటుందన్నారు. పెట్టుబడికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయదని, రుణం కోసం బ్యాంకుల చుట్టూ నెలల తరబడి తిరిగినా అప్పులు ఇవ్వరన్నారు. ఇక్కడి భూముల్లో చెరుకు, అల్లం, కూరగాయలు సాగు చేస్తారు. వాటిని తెలంగాణలోని హైదరాబాద్, తాండూరు, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లోనే విక్రయిస్తారు. తాము ఉంటున్నది కర్ణాటక అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తెలంగాణలోనే విక్రయిస్తామని తెలిపారు. ఇక్కడ బోర్ల నీటితోనే వ్యవసాయం చేస్తారు. 200 మొదలుకొని 500 అడుగుల లోతు వరకు బోర్లు వేయాల్సిందేనని రైతులు పేర్కొన్నారు. కరెంటు కష్టాలతో తరచుగా ఇబ్బందులుపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పోచవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉంది. ఇక్కడ కన్నడతోపాటు తెలుగు మాధ్యమంలోనూ విద్యాబోధన చేస్తారు. తమ పిల్లలు చదువుకున్నా ఇక్కడ పెద్దగా ఉద్యోగాలు దొరకవని పేర్కొన్నారు. ఇక్కడి పాఠశాలల్లో విద్యార్థులకు దొడ్డు బియ్యంతోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి బస్సు వస్తుందని, మిగతా రవాణా వ్యవస్థ ఆటోలేనని తెలిపారు. యూనిఫారాలు సైతం ఆలస్యంగానే అందుతాయని తెలిపారు.
పక్కనే గల తెలంగాణలోని భూముల ధరలకు, కర్ణాటకలోని పోచవరం ప్రాంతంలోని భూముల ధరలకు తేడా ఉన్నది. పోచవరం పరిసరాల్లో ఎకరా రూ.8 నుంచి 12లక్షల లోపే, ప్రధాన రోడ్డు పక్కన ఉంటే రూ.20లక్షల వరకు పలుకుతుందని తెలిపారు. తెలంగాణలో చిన్న పల్లెటూరులోనూ ఎకరా భూమి ధర రూ.25లక్షల పైగానే ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో భూముల ధరలు పెరిగాయని, అక్కడ నుంచి తమ గ్రామానికి అమ్మాయిలను ఇచ్చిన వారు భూములు విక్రయిస్తే ఆడపిల్లలకు లక్ష రూపాయలకు పైగా డబ్బులు వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇస్తుండడం సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.
తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 పింఛన్‌గా అందుతున్నది. అదే కర్ణాటకలో వితంతువులకు ప్రస్తుతం రూ.800 అందుతుండగా, మూడు నెలల క్రితం రూ.600 వచ్చేవని, ఇటీవలె పెంచారని, వృద్ధులకు నెలకు రూ.1200 పింఛన్ వస్తుందన్నారు. దివ్యాంగులకు రూ.1500 ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతినెలా పింఛన్ వస్తుండగా తమ దగ్గర ఒక్కోసారి రెండు మూడు నెలలకొకసారి పింఛన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. ఓ వైపు పింఛన్ డబ్బుల్లోనూ వ్యత్యాసం ఉందన్నారు. తమకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలో జీవిస్తున్న వారికి తమ కంటే అధికంగా పింఛన్ డబ్బులను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో టాప్‌లో ఉన్నది. ప్రతిరోజూ టీవీల్లో తెలంగాణ వార్తలు వింటుంటాం.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తెలుసుకోవడంతోపాటు తాము స్వయంగా కొన్ని పొందుతున్నాం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. మా గ్రామం తెలంగాణలో కలుపాలని కోరుతున్నాం. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే చక్కటి పథకాలు అమలు జరిగి దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ఇది తెలంగాణ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి తాలూకాలోని పోచవరం, కుంచవరం గ్రామస్తుల అభిప్రాయం.
– పరిగి, ఫిబ్రవరి 24
పోచవరం గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. గ్రామంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, మురుగుకాలువలు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మురికినీరు రోడ్డు పక్కనే ప్రవహిస్తున్నది. తెలంగాణలో ప్రతినెలా గ్రామాలకు నిధులు వస్తుండగా తమ దగ్గర ఆ పరిస్థితి లేదని చెప్పారు. మూడేండ్ల క్రితం సోలార్ వీధిదీపాలు కాలిపోగా ఇప్పటివరకు వాటిని మరమ్మతు చేయించిన వారు లేరని పేర్కొన్నారు. రోడ్లు అంతంతమాత్రమేనని వారు వాపోయారు. డబ్బులు వచ్చినప్పుడే అభివృద్ధి పనులు చేపడుతారని, తెలంగాణలో మాదిరి నిరంతరం అభివృద్ధి జరుగదన్నారు. తెలంగాణలో ఊరూరికి చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఉండగా ఇక్కడ చెత్త సేకరణ దేవుడెరుగు మురుగుకాలువలు, రోడ్లు శుభ్రం చేసేవారు లేరని వాపోయారు.
పోచవరం, కుంచారం గ్రామాలకు చెందిన రైతులకు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడి గ్రామంలో సుమారు 300 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. వారందరికీ రైతుబంధు కింద వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఒక్కో ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుండడంతో వారు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కరెంటు 24 గంటలు అందుతుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు సాగవుతున్నాయి. రైతులు ఏ కారణంగా చనిపోయినా రైతుబీమా కింద రూ.5లక్షలు అందుతున్నాయి.
‘ఇటువైపు సంక్షేమంతో సంతోషమైన జీవనం.. అవతలివైపు నిత్యం సమస్యలతో సహజీవనం.. ఇక్కడి పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత దర్శనమిస్తే.. మట్టి రోడ్లు, మురుగు పరుగుతో అక్కడి గ్రామాలు కంపుకొడుతున్నాయి. చెంతనే ఉండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కండ్లారా చూస్తున్నా.. తమ రాష్ట్రంలో ఇందులో పదోవంతైనా లేని దుస్థితి వికారాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్ర పరిధిలోని గ్రామస్తులది. నిత్యం సమస్యలతో సతమతమవుతున్న తమ తమ గ్రామాలను మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న తెలంగాణలో కలుపాలని కోరుతున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి తాలూకాలోని పోచవరం, కుంచవరం గ్రామాలవాసుల జీవన స్థితిగతులపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ఆరా తీయగా స్థానికులు పలు విషయాలను వివరించారు. ‘మేము స్వయంగా కొన్ని తెలంగాణ పథకాలను పొందుతున్నాం.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ పల్లెల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా.. వేలల్లో ఆసరా పింఛన్లు.. పంట రుణాలు, మెరుగైన విద్య, వైద్యం ఇంకా ఎన్నో ఉన్నాయి.. కర్ణాటకలోని మా గ్రామంలో కేవలం 6 గంటల కరెంట్, అరకొర పింఛన్లు, అంతంతమాత్రంగానే వైద్యం, విద్యం అందుతున్నది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
-పరిగి, ఫిబ్రవరి 24
కర్ణాటకలోని కుంచవరానికి చెందిన నాకు తెలంగాణలోని బంట్వారం మండలం బొపనారంలో నాలుగు ఎకరాల భూమి ఉన్నది. కుంచవరంలో ఒక ఎకరం భూమి ఉన్నది. ఈ నాలుగు ఎకరాల భూమికి కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.40వేలు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుండగా కర్ణాటకలోని ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. నా భర్త రాములు ఏడాది క్రితం చనిపోతే రైతుబీమా పథకం కింద రూ.5లక్షలు కూడా అందాయి. ఈ డబ్బులు మా కుటుంబానికి భరోసానిచ్చాయి.
-తలారి రత్నమ్మ, కుంచవరం, కర్ణాటక రాష్ట్రం
నాకు తెలంగాణలోని తొర్మామిడిలో 3 ఎకరాల భూమి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి ఒక ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.30వేలు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది. పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పంటలు సాగు చేస్తున్నాం. బ్యాంకుల్లో సైతం పాత రుణం చెల్లించిన మరుసటి రోజే మళ్లీ రుణం ఇస్తున్నారు. తెలంగాణలో భూములున్న మా రైతులకు సైతం రైతుబంధు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు. – తాటి అంజప్ప, రైతు, పోచవరం
పథకాల అమల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ప్రధానమంత్రి మోదీ. ప్రతిరోజూ టీవీల్లో తెలంగాణ వార్తలు వింటుంటా. ప్రజలకు సీఎం కేసీఆర్ చేస్తున్న మంచిని వింటుంటే సంతోషంగా ఉంటుంది. మా చుట్టాలు తెలంగాణలో ఉంటారు. వారంతా పథకాలు పొందుతున్నారు. మా ఊరును తెలంగాణలో కలుపాలని కోరుతున్నాం. కర్ణాటకలో ఒక్క రూపాయి పెట్టుబడి సాయంగా ఇవ్వరు, కరెంటు కష్టాలూ తప్పవు.
– గడ్డమీది నర్సింహులు, పోచవరం
పథకాల అమలు, అభివృద్ధి విషయంలో తెలంగాణతో కర్ణాటకకు అసలు పోలికే లేదు. తెలంగాణలో పేదల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయి. నాకు తొర్మామిడిలో ఒకటిన్నర ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు వస్తున్నది. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన అనేక పథకాలతో అక్కడ వ్యవసాయం పండుగలా మారింది. – మహ్మద్ యూసుఫ్, పోచవరం
ఏ పథకం తీసుకున్నా తెలంగాణ పథకాలే చాలా బాగున్నాయి. వ్యవసాయం నుంచి మొదలుకొని పేదింటి యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా 116 అందించడం చాలా చక్కటి కార్యక్రమం. మా దగ్గర గరీబోళ్ల ఆడపిల్లల పెండ్లి చేయాలంటే ఇబ్బందికరం. సీఎం కేసీఆర్ ఆడపిల్లల పెండ్లిళ్లకు సాయం అందించడం చాలా గొప్ప పథకం. అభివృద్ధి సైతం తెలంగాణలోనే వేగంగా జరుగుతుంది. – ప్రభు, పోచవరం
నాకు తెలంగాణలోని తొర్మామిడిలో ఒక ఎకరం 13 గుంటల భూమి ఉన్నది. ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకులో జమకాగానే ఠంచనుగా ఫోన్‌కు మెసేజ్ వస్తున్నది. ఆ వెంటనే నేను బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని పంటల సాగుకు వాడుకుంటా. సీఎం కేసీఆర్ కరెంటుపై శ్రద్ద వహించడంతో అసలు కరెంటు కష్టాలు లేకుండాపోయాయి.
– తలారి శ్రీనివాస్, పోచవరం