రంగారెడ్డి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఖనిజాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని గనులు, ఖనిజాలు.. సంబంధిత శాఖకు ఈ ఏడాది కూడా భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఇంకా నెలన్నర రోజుల సమయం ఉండగానే మంచి ఆదాయం అందింది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే లక్ష్యానికి మించి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.92 కోట్లు కాగా, రూ.96కోట్ల(140 శాతం) ఆదాయం సమకూరింది. మార్చి నాటికి అదనంగా మరో రూ.10కోట్ల ఆదాయాన్ని రాబట్టుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నారు.
జిల్లా గనుల శాఖ గత రెండేండ్లుగా భారీగా ఆదాయాన్ని పొందుతున్నది. జిల్లాలోని గనుల్లో ఖనిజాల ఉత్పత్తులు పెరగడంతో అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 109 వరకు క్వార్ట్, గ్రానైట్, కంకర పరిశ్రమలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 97 మాత్రమే పనిచేస్తున్నాయి. రాయి, కంకర పరిశ్రమలు 51, బ్లాక్, కలర్ గ్రానైట్ పరిశ్రమలు 15, పలుగు రాయి, ఫెల్డ్ స్పార్ పరిశ్రమలు 43 వరకు వినియోగంలో ఉన్నాయి. చేవెళ్లలో హస్తేపూర్, అనంతవరంలలో రెండు లేటరైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లీజు డబ్బులను ఆయా పరిశ్రమల యజమానుల నుంచి గనులు, భూగర్భ శాఖ వసూలు చేస్తున్నది. 2022-23 సంవత్సరంలో రూ.154.65కోట్ల ఆదాయం రాగా, 2023-24 సంవత్సరానికి సంబంధించి జనవరి నాటికే అనూహ్యంగా రూ.96కోట్లు వచ్చింది. ఇంకా మార్చి వరకు సమయం ఉండగానే ఇంత మొత్తం ఆదాయం రావడంతో అదనంగా మరో రూ.10 కోట్లు సమకూర్చుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు, లీజుల రెన్యువల్‌కు ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాక గనుల తవ్వకాల్లో అక్రమాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయినా.. కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అనుమతులు ఒక చోట పొంది మరొక చోట తవ్వకాలు జరపడం.. పొందిన అనుమతుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఖనిజాన్ని వెలికితీయడం వంటి ఉదంతాలు అడపాదడపగా చోటు చేసుకుంటున్నాయి. గ్రానైట్ అక్రమ రవాణా సైతం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలను విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు రూ.50లక్షల వరకు జరిమానాల రూపంలో వసూలైంది.
జిల్లా అభివృద్ధ్దిలో గనులు, భూగర్భ శాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. గనుల యజమానులు ఏటా ప్రభుత్వానికి చెల్లించే సీనరేజ్ చార్జీపై 30 శాతాన్ని ‘జిల్లా ఖనిజ సంక్షేమ నిధి’కి జమ చేస్తూ వస్తున్నారు. ఈ నిధులతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకుగాను సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడుతున్నారు. క్వారీ లీజుల ద్వారా ఇప్పటివరకు గనులు, భూగర్భ శాఖ జిల్లా ‘ఖనిజ నిధి’కి రూ.111.75కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఖనిజ కమిటీ సభ్యుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధుల కేటాయింపు జరుగుతున్నది. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణ రోడ్లు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా.. తెలంగాణలో ఆదాయ వృద్ధ్ది కనిపిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గనులు, భూగర్భ శాఖలో భారీ సంస్కరణలను తీసుకురావడమే ఇందుకు కారణం. ఈ ఏడాది జిల్లాలో గనుల లీజు రూపంలో లక్ష్యానికి మించి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. మైనింగ్ అక్రమ రవాణా తదితర విషయాల్లో కేసులు నమోదు చేసి జరిమానాలను విధిస్తున్నాం.
-ప్రవీణ్ రెడ్డి, గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు, రంగారెడ్డి జిల్లా