విజేతలతో పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది.. అరే మనం వెనుకబడేందుకు గల కారణం ఏమిటనేది..!! గొప్ప సాహిత్యకారులను కలిసినప్పుడో, ఏవైనా మంచి పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడో గుర్తుకొస్తుంది.. బుక్స్ చదివేందుకు అసలు సమయమే కేటాయించడం లేదని..!! టింగ్.. అని శబ్దం వస్తే చాలు కండ్లు ఫోన్‌ను వెతుకుతున్నాయి.. నోట్లో ముద్ద పెట్టుకుంటున్నా ఆపేసి చూసే అంతగా ఫోన్‌కు బానిస అయ్యామనేది..!! ఇంట్లో గొడవ జరిగినప్పుడే తెలుస్తుంది.. అయ్యో కుటుంబసభ్యులకు కూడా సరిగ్గా సమయం ఇవ్వడంలేదే అని..!! మార్పు కోసం ఇదే మంచి సమయం అని ఫిక్స్ అయితే కొత్త సంవత్సరం గొప్ప ఆరంభానికి దారి తీస్తుంది. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నదే కొత్త ఏడాదిలో కొంగొత్త ఆశ..!! హ్యాపీ న్యూ ఇయర్..!!
– పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 31
పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 31: కొత్త సంవత్సరాలు వచ్చి పోతూనే ఉంటాయి. కానీ, మనం చేసే కొన్ని పనులు చాలా కాలం గుర్తుండిపోతుంటాయి. వెనక్కి చూసుకుంటే అవి ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తుంటాయి. వాటిని నెమరువేసుకున్నప్పుడల్లా తెలియని సంతోషాన్ని నింపుతాయి.
కొత్త ఏడాదిలో నూతన ఉద్యోగంలో స్థిరపడాలనుకునే యువత లక్ష్యంపై గురిపెట్టాలి. ఇప్పటివరకు అయిన సన్నద్ధత ఒకలా ఉంటే.. కొత్త సంవత్సరంలో మరింత గట్టిగా దృష్టిపెట్టాలి. కోచింగ్‌లకు వెళ్తూనే.. గతంలో ఆయా ఉద్యోగాల్లో టాపర్లుగా నిలిచినవారి గురించి తెలుసుకోవాలి. విజేతల అలవాట్లు, వారు సన్నద్ధమైన తీరు, సబ్జెక్టులపై పట్టుకోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇలా ప్రతి అంశాన్ని తెలుసుకుంటే కొంతైనా మేలుకొనే అవకాశం ఉంటుంది.

సమయం వృథా కాకుండా ప్రతి నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది. నిపుణుల సలహాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవన్నీ విజయానికి నాంది పడేందుకు సహకరిస్తాయి. వివిధ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువత పుస్తక పఠనాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాన సముపార్జన సాధ్యమనే విషయాన్ని గ్రహించి ముందుకు వెళ్లాలి.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనేవరకు ప్రతి మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ భాగమయింది. యువత విషయంలో ఇంకొంచెం ఎక్కువే అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తిలేదు. సోషల్‌మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. యాప్‌లు ఎక్కువయ్యాయి. ఫలితంగా చాలామంది అలా ఫోన్లను చూస్తూ ఉండిపోతున్నారు. పక్కనే మనిషి కూర్చున్నా, ఫంక్షన్లకు వెళ్లినా తల పక్కకు తిప్పకుండా ఉండిపోయేలా మారారు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది.
కొంచెం కొంచెంగా ఫోన్‌ను దూరం పెట్టేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు స్నేహితులతో స్వయంగా మాట్లాడేందుకు సిద్ధం కావాలి. స్మార్ట్ఫోన్లను తదేకంగా చూడటం వల్ల కలిగే అనర్థాలపై మరింత అవగాహన పెంచుకోవడం మంచిది. ఫోన్‌ను దూరం పెట్టేందుకు ఇది దోహదంచేస్తుంది. ఇతర అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా స్మార్ట్‌గా దూరం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలు, మ్యాగజైన్లు చదవడం వంటివి చేయాలి. మరింత ఆసక్తి కలిగించే పజిల్స్ ఆడేందుకు ఆసక్తి చూపితే కొంత వరకైనా ఫోన్‌ను దూరం పెట్టొచ్చు.
ఉదయం లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేవరకు బిజీబిజీ జీవితం. ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు ఇలా ఎన్నో.. కనీసం సెలవు రోజుల్లోనూ కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వని పరిస్థితి. ఇవన్నీ కుటుంబంలో గొడవలకు కారణం అవుతున్నాయి. అందుకే కొత్త ఏడాది సందర్భంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వారంలో ఒకరోజు లేదా నెలలో కనీసం రెండుసార్లయినా భార్య, పిల్లలతో రోజంతా గడిపేలా ప్లాన్ చేసుకోవాలని ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. రోజులో గంటయినా పిల్లలతో సరదాగా ఉండేందుకు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు.
కొత్త ఏడాది నుంచైనా సమయం వృథాకు చెక్ పెట్టాలి. సరైన షెడ్యూల్ రూపొందించుకుంటేనే ఇది సాధ్యం. పలానా సమయంలో ఏం చేయాలి, పలానా పని ఎంత సమయంలో పూర్తిచేయాలి? పలానా వాళ్లను ఎప్పుడు కలవాలి? ఇలా ఏదైనా ఒక షెడ్యూల్‌తో ముందుకు వెళ్తేనే సమయం వృథాను అరికట్టవచ్చు. సమయం ఎక్కడ వృథా అవుతుందో గుర్తిస్తూ.. దానిని సరిచేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తే కొత్త సంవత్సరంలో దూసుకెళ్లొచ్చని సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో వ్యాయామంతో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.