సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఏ ఒక్కటీ పట్టాలెక్కలేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు ఒక్కటి కూడా మొదలు కాలేదు.. వాస్తవంగా కేటాయించిన బడ్జెట్లో పావు వంతు కూడా నిధులు మంజూరు చేయలేకపోవడం సర్కారు చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది.
ఇదిలా ఉంటే బుధవారం ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులో జీహెచ్ఎంసీకి నామమాత్రంగా రూ.3101.21 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. చేతిలో కీలకమైన హెచ్ సిటీ ప్రాజెక్టులు ఉన్నాయని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల దృష్ట్యా పలు అభివృద్ధి ప్రతిపాదనలు పట్టాలెక్కించాల్సిన అవసరం ఉందంటూ జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి గంపెడాశలతో రూ.7582 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించింది. కానీ ప్రజా పాలన సర్కారు మాత్రం గ్రేటర్ అభివృద్ధిపై మరోసారి శీతకన్ను వేసి 40 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిపింది.
సక్రమంగా లేని నిధుల విడుదల
బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ ఏడాదిలో పూర్తయ్యేలా కనబడడం లేదు. గతేడాది హెచ్ సిటీ ప్రాజెక్టుకు రూ.2600 కోట్లు కేటాయిస్తే నిధుల విడుదల సక్రమంగా లేకపోవడంతో గజం స్థలం కూడా భూ సేకరణ జరపలేదు. రాబోయే రోజుల్లోనూ ఆశించిన స్థాయిలో పనులు జరిగేలా లేవు.. జీహెచ్ఎంసీ రూ.4వేల కోట్లు అవసరమని అడిగితే రూ.2654 కోట్లు మాత్రమే కేటాయించింది. వాస్తవంగా ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే భూ సేకరణ అత్యంత కీలకం. పనులకు ఎంత ఖర్చు అవుతుందో? భూ సేకరణకు దాదాపు అంతే వ్యయం అవుతున్నది.
ఇందులో భాగంగానే రూ.400 కోట్లు భూ సేకరణకు అవసరమని జీహెచ్ఎంసీ కోరితే సర్కారు కేవలం రూ.18.11 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనికి తోడు అప్పుల ఊబిలో ఉన్నాం…రూ.1500 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని.. కొత్త ప్రాజెక్టులకు నయా పైసా లేదని.. క్యాపిటల్ వర్క్స్‌కు రూ.1000 కోట్లు కావాలని అడిగితే ఒక్క రూపాయి కేటాయించకపోవడం గమనార్హం. గ్రేటర్ అభివృద్ధి విషయంలో సర్కారు పట్ల ప్రజలు పెదవి విరుస్తుండడం గమనార్హం.