కొడంగల్, జనవరి 28 : కొడంగల్‌లో జరిగే మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం తెలంగాణ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు గట్టు రాంచంద్రారావు తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ప్రత్యేక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొడంగల్ అభివృద్ధి సాధ్యపడుతుందని భావించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగిందన్నారు. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏర్పాటైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నదని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కాగా కొడంగల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు మంజూరైన మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను తరలించడం బాధాకరమని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొడంగల్ అభివృద్ధి పథంలో ముందుకు కాకుండా ఉన్నవాటిని ఊడ్చివేసే పరిస్థితి తలెత్తుతుందన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులంటూ జీవనోపాధిని, తలదాచుకునే ఇండ్లను కూల్చివేసి కొడంగల్ ప్రజలను నిరాశ్రయులుగా మారుస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోనే కాదు.. రాష్ట్రంలోనే రేవంత్‌రెడ్డి అంటే ప్రజలు చీదరించుకొంటున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలతోపాటు 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజా మోసానికి పాల్పడినట్లు ఆరోపించారు. తులం బంగారం, మహిళలకు రూ.2500, మహిళలకు స్కూటీ వాహనాలు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, వృద్ధులకు పెంచిన పెన్షన్ వంటి ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడిగేందుకు వస్తే వీటన్నింటిపై నిలదీయాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం కొడంగల్‌లో బీఆర్ఎస్కు ప్రజా బలం మెండుగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం తలపెడుతున్న వినాశనంపై ప్రజలు మండిపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళితే బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మహిపాల్, బొంరాస్‌పేట మాజీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, బొంరాస్‌పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు, 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వాణిశ్రీ, బీఆర్ఎస్ నాయకులు నరేశ్, అరుణ్ పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రతిఒక్కరం పాటుపడదామని, కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడుదామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లోనే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని, ప్రజలు ఓటు చేసే సమయంలో అభివృద్ధి చేసేవారా..? లేక అభివృద్ధిని కుంటుపడేలా చేసేవారికా.. అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో కొడంగల్ పట్టణం ఏవిధంగా అభివృద్ధి చెందింది.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నర సంవత్సరాల్లో కుంటుపడిన అభివృద్ధిని గ్రహించాలని తెలిపారు.
2018 సంవత్సరానికి ముందు కొడంగల్ వీధుల్లో నడిచే పరిస్థితి ఉండేది కాదని.. అప్పట్లో తాను (పట్నం నరేందర్‌రెడ్డి) ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కొడంగల్ పరిస్థితి ఏవిధంగా మారిందో ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడిని ఎన్నుకుంటే ప్రజా సంక్షేమానికి ఎటుంటి లోటు ఉండదన్నారు. సొంత ప్రయోజనాల కోసం పాటుపడే కాంగ్రెస్ నాయకులతో ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కు గడ్డుకాలం ఏర్పడుతుందని భావించి, మున్సిపల్లో రైతులు తక్కువగా ఉంటారని మున్సిపల్ ఎన్నికలను తెరపైకి తెచ్చినట్లు తెలిపారు.