Gattu Ippalapalle | కడ్తాల్, ఏప్రిల్ 13 : గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని మండల సాధన సమితి నాయకత్వం స్పష్టం చేసింది. తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ… జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం చేపట్టిన దీక్షలో అశోక్‌గౌడ్, సాయిరాం, భాస్కరాచారి, అనిల్, కృష్ణాజీ, బాలయ్య, మల్లయ్య, మాణిక్యరెడ్డి తదితరులు కూర్చున్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలికారని తెలిపారు. గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. మండల కేంద్రం ఏర్పాటుకు విడతాల వారీగా ఇప్పటి వరకు 299 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. గట్టుఇప్పలపల్లి మండలంగా ప్రకటించని పక్షంలో, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.