ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 13 : ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటున్నది. ఎక్కువగా ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండడంతో యువత, విద్యార్థులను టార్గెట్ చేస్తూ మత్తులోకి దించుతున్నారు. దండుమైలారం, పోచారం గ్రామాల్లో అధిక సంఖ్యలో యువత గంజాయికి బానిసలుగా మారి ఇండ్లల్లో అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దండుమైలారం గ్రామంలో గంజాయి సేవిస్తూ.. రాత్రి సమయాల్లో యువత చోరీలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల దండుమైలారం గ్రామంలో ఓ యువకుడు గంజాయి సేవించి పక్కింటి యువతిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.
దీంతో పోలీసులు గ్రామంలో 144సెక్షన్ విధించి గంజాయిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. ఇటీవల మంచాల మండలంలోని ఓ గ్రామంలో గంజాయికి బానిసలుగా మారిన పలువురు యువకులు, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. గంజాయి రవాణాపై పోలీసుశాఖ సీరియస్గా తనిఖీలు చేపడుతున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. ఇటీవల నియోజకవర్గంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నం శివారులో గంజాయి దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నది. యువత అర్ధరాత్రి వరకు రోడ్లపైనే కనిపిస్తున్నారు. ప్రత్యేక అడ్డాలను ఏర్పాటు చేసుకుని రాత్రి 1గంట తర్వాత గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి దందాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాలు కోరుతున్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ప్రైవేటు హాస్టళ్లు ఎక్కువగా ఉండడంతో యువకులు రాత్రి సమయాల్లో గంజాయి సేవించి సాగర్హ్రదారిపై అల్లర్లు సృష్టిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు మహేశ్వరం, చౌటుప్పల్, అబ్దుల్లాపూర్మెట్, బాటసింగారం, పెద్దఅంబర్పేట్తో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రైవేటు హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులను మచ్చిక చేసుకుని ఈ రొంపిలోకి దింపుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిన కళాశాలల యాజమాన్యాలు, పోలీసుశాఖలు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తూ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉండే ఓ విద్యార్థిని అడిగినప్పుడు నాతో పక్క రూంలో ఉండే విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి రాత్రి సమయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. గంజాయికి బానిసలుగా మారిన విద్యార్థులు, యువత రాత్రి సమయాల్లో పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌస్లు, విల్లాల్లో పెద్ద ఎత్తున రేవ్పార్టీలు నిర్వహిస్తూ గంజాయి సేవిస్తూ చిత్తవుతున్నారు.
గంజాయి సేవిస్తున్న యువతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గంజాయి వ్యాపారులు రెచ్చిపోతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వసతి గృహాల్లో ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి.
– రవణమోని జంగయ్య ముదిరాజ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు
గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతాం. ఇటీవల గంజాయితో పట్టుబడిన వారిని రిమాండ్ చేశాం. ప్రధాన రహదారులు, ఔటర్రింగ్రోడ్డుతో పాటు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాం. గంజాయి సేవిస్తే వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి సేవిస్తున్నట్లుగాని, విక్రయిస్తున్నట్లుగాని తెలిస్తే గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం సీఐ