జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గంజాయిని అవుటర్ రంగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మీ దుగా హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకు చేరవేస్తున్నారు. పోలీసు లు ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట గంజాయి ముఠా వారికి చిక్కుతూనే ఉన్నది.
ముఖ్యంగా ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో ఇటీవల సుమారు 20 మంది వరకు గంజాయి వ్యాపారులు పోలీసులకు పట్టుపడగా వారి నుంచి వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు అధికంగా ఉం డడంతో ఈ ప్రాంతాలను ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బస్టాండ్లలోని పాన్‌షాపులు, చాయ్ హోటళ్లు, ఇంజినీరింగ్ కళాశాలల ఎదుట ఉండే పాన్‌షాప్‌లు, హోటళ్లను ఎంచుకుని.. అక్కడ గంజాయిని నిల్వ చేస్తూ విద్యార్థులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
-రంగారెడ్డి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అల్లూరి ఏజెన్సీ, తెలంగాణలోని ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.
జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉన్న పెద్దఅంబర్‌పేట, శంషాబాద్ , హిమాయత్‌సాగర్ వరకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం గుట్టుగా సాగుతున్నది. తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిబట్ల, కొంగరకలాన్ తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల వద్ద ఒడిశా, బీహార్ రాష్ర్టాలకు చెందిన అనేక మంది కూలీలు పనిచేస్తున్నారు. వారి కోసం ఆయా ప్రాంతాలకు వ్యాపారులు గంజాయిని తరలించి విక్రయిస్తున్నారు. అలాగే, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, హాస్టళ్లు, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నది.
గంజాయి వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మహేశ్వరం డివిజన్ పరిధిలోని పలు ఠాణాలను కలుపుకొని ఎస్వోటీ బృందాలు పనిచేస్తున్నాయి. ఇటీవల వ్యాపారులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. వారిపై కేసులు పెడుతున్నాం. ఎక్కువసార్లు గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిన వారిపై పీడీయాక్టులు నమోదు చేస్తాం. విద్యార్థులు, యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.
-సునీతారెడ్డి, మహేశ్వరం డీసీపీ