కేశంపేట, మార్చి 9: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ నెల 5న మృత్యువాత పడ్డ గంప ప్రవీణ్ (Gampa Praveen)పార్థివ దేహం ఆదివారం మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చేరుకుంది. అమెరికా నుంచి ఫ్లైట్‌లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రవీణ్ మృతదేహాన్ని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శంషాబాద్ నుండి నేరుగా కేశంపేట మండల కేంద్రానికి తరలించిన కుటుంబ సభ్యులు తమ నివాసంలో బంధువుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు.
ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి విగత జీవిగా ఇంటికి వచ్చిన కుమారుడిని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేశంపేట మాజీ సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రవీణ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ప్రవీణ్‌కు అంతిమ వీడుకోలు పలికారు.