మంచాల, మార్చి 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్య్సశాఖ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో మొండిచేయి చూపించిందని మత్స్య కార్మిక సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మత్య్సశాఖ పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మంచాల మండల మత్స్య కార్మిక సంఘం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించడం సిగ్గు చేటని అన్నారు.
2025-26 సంవత్సరంలోని బడ్జెట్లో మత్య్స శాఖకు మొండిచేయి చూపించిందని, ముదిరాజ్‌లను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మారుస్తామని చెప్పి మాట తప్పారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య శాఖకు వందకోట్ల రూపాయలను కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గు చేటన్నారు. మత్స్య శాఖకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించడంతో పాటు మంత్రిని కూడా నియమించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మత్స్య శాఖ నాయకులు జిలమోని సత్తయ్య, చిందకింది చక్రపాణి, నీళ్ల కృష్ణ, తవిటి యాదగిరి, జిలమోని మల్లేశ్, చింతకింది జంగయ్య తదితరులు ఉన్నారు.
కొత్తూరు : రాష్ట్ర బడ్జెట్లో మత్స్యశాఖకు నిధులు కేటాయించకపోవడంతో శుక్రవారం అసెంబ్లీ ముట్టడకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన కొత్తూరు మండల మత్స్యకార నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తూరు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మాసుల రామకృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. మత్స్యశాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం గూడూరు మత్స్య సహకారం సంఘం అధ్యక్షుడు సురేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు నిధులు కేటాయించే వరకు పోరాటం ఆగదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, గడ్డం రమేజవ్ గొడుగు రవి తదితరులు ఉన్నారు.