రంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గత మూడు రోజులుగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. రవాణా సౌకర్యం కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. గతంలో జిల్లాలోని ఓ వంతెన నిర్మాణంలో జరిగిన ఆలస్యం కారణంగా ఓ కారు వాగులో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు.
మూడు రోజుల క్రితం కూడా పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద కాల్వలో మరో వ్యక్తి కొట్టుకుపోయాడు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ సర్కారు వంతెనల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల వంటి నియోజకవర్గాల్లోని పలు వాగులపై వంతెనల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇటీవల వర్షాలకు ఎక్కడికక్కడే గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కూడా విడుదల చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా పనులు చేపట్టడంలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా గ్రామాల ప్రజలు వంతెనలు దాటడం ఇబ్బందికరంగా మారుతున్నది. వెంటనే సర్కారు వంతెన నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదకరంగా మూడు ప్రధాన వంతెనలు
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మూడు వంతెనలు ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలంలో ఈ వంతెనలపై ప్రమాదస్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నది. ఇటీవల వర్షాలకు ఈ వంతెనలకు అనుసంధానంగా ఉన్న పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెనల నిర్మాణాలకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టలేకపోతున్నారు. మండల పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి లష్కర్‌గూడ వెళ్లే ప్రధాన రోడ్డుపై ఉన్న వంతెన అత్యంత ప్రమాదకరంగా మారింది.
అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి లష్కర్‌గూడ, అనాజ్‌పూర్, ఉమర్‌ఖాన్‌గూడ, సంఘీనగర్ వంటి పలు గ్రామాలకు రవాణా సౌకర్యానికి ఇదే ప్రధాన వంతెన. ఈ వంతెన నుంచి వర్షాకాలంలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగులు దాటే సమయంలో కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యారు. ఈ వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.6.50 కోట్లను కేటాయించారు. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి సారించడంలేదు.
బాటసింగారం -మజీద్ఫూర్ మధ్య..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం నుంచి మజీద్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈ రోడ్డుపై గత వారం రోజుల నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఈ వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించినప్పటికీ పనులు ప్రారంభించడంలేదు. ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి గ్రామాల మధ్య రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే.. ఇంజాపూర్ నుంచి ఎమ్మెల్యే స్వగ్రామమైన తొర్రూరు గ్రామానికి వెళ్లే రోడ్డుపై నుంచి కూడా గత మూడు రోజులుగా వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు.
ఈ రోడ్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3కోట్ల నిధులను విడుదల చేశారు. కాని, పనులు ప్రారంభించకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మాసబ్‌చెరువు నుంచి వచ్చే వరదనీరు పూర్తిగా ఈ రోడ్డుపై నుంచి ప్రవహించింది. దీంతో రెండు మూడు రోజులుగా ఈ రోడ్డు నుంచి రవాణా సౌకర్యాన్ని నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వంతెన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
దీంతో ప్రతిరోజూ హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని శ్రీఇందు కళాశాల వద్ద గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచితున్నాయి. మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు మండలాల్లో కూడా పలు గ్రామాలకు అనుబంధంగా ఉన్న వంతెన నిర్మాణాలు ప్రారంభం కావడంలేదు. నిర్మాణాలకు నిధులున్నప్పటికీ ప్రభుత్వం పనులు ప్రారంభించడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.