వికారాబాద్/రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజానీకం అయోమయానికి గురవుతున్నది. ఎక్కడికి వెళ్లినా బంకుల్లో నో స్టాక్ బోర్డు కనపడుతున్నది. డీజిల్, పెట్రోల్ కొరత నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా ఇంధన కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు సరిపడా అయిల్ నిల్వలున్నాయని అధికారులు చెబుతున్నా బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం గమనార్హం. పెట్రోల్ బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. మే మొదటి వారంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్న దృష్ట్యా అప్పటివరకు పెట్రోల్, డీజిల్ కొరత సమస్య ఇదే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత రెండు రోజులుగా జిల్లాలోని బంకులకు ఒకట్రెండు ట్యాంకర్లు రాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ కార్లు, బైకులను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడో ఒక్క చోట బంకుల్లో ఆయిల్ నిల్వలున్నప్పటికీ భారీగా వాహనదారులు వస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని నో స్టాక్ బోర్డులు పెడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఒక్క ట్యాంకర్ భారీగా వచ్చే వాహనాలతో గంటలో ఖాళీ అవుతున్నది. పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారంతో అవసరమున్నా, లేకున్నా ప్రతి వాహనదారుడు ట్యాంక్ ఫుల్ చేస్తుండటంతో కొరత ఏర్పడుతున్నది. సంబంధిత అధికారుల ఆదేశాలతో జిల్లాలోని ఆయిల్ నిల్వలున్న బంకుల యజమానులు ప్రతీ వాహనంలో రూ.వెయ్యి డీజిల్ మాత్రమే పోస్తున్నారు. మరోవైపు పెట్రోల్ కోసం డబ్బాలు పట్టుకొని భారీ క్యూ లైన్లలో వాహనదారులు నిల్చుంటున్నారు.
డీజిల్ కొరతతో వాహనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఆర్టీసీ సైతం సగం బస్సులనే నడిపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆటోలు, జీపులు, కార్లు సైతం పెట్రోల్ డీజిల్ కొరతను ఎదుర్కొంటూ బయటకు వెళ్లటంలేదు. దీంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఆదాయ వనరులు లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటల కోతలు కూడా ప్రారంభమైనందున వరి కోత మిషన్లకు, ట్రాక్టర్లకు డీజిల్ దొరకక కోతలు కూడా ముందుకు సాగడంలేదు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివాహాలకు వెళ్లేవారు సైతం రవాణా సౌకర్యం లేక ప్రయాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొన్నది.
పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా.. బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ ఫుల్‌గా దొరుకుతున్నది. పెట్రోల్ బంక్‌ల్లో డీజిల్, పెట్రోల్ వచ్చిన వెంటనే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి బ్లాక్‌లో నిల్వ ఉంచుకుంటున్నారు. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ దొరకనప్పుడు బ్లాక్ మార్కెట వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో జిల్లాలో పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది.
హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డిజిల్లాలో 440 వరకు పెట్రోల్ బంక్‌లున్నాయి. ఈ బంక్‌ల నుంచి ప్రతిరోజూ 6లక్షల లీటర్ల డీజిల్, 3లక్షల లీటర్ల పెట్రోల్ గతంలో వినియోగించేవారు. కాని, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరతతో సగానికి పైగా పెట్రోల్ బంక్‌లు మూసివేశారు. గత వారం రోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అనేక పెట్రోల్ బంక్‌లకు పెట్రోల్, డీజిల్ రావడంలేదు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని హైదరాబాద్-నాగార్జునసాగర్, శ్రీశైలం-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్ రహదారుల్లో పెట్రోల్ బంక్‌లు అత్యధికంగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు పెట్రోల్, డీజిల్ లేక రోజుల తరబడి నిలిచిపోతున్నాయి.