ఊరికి ఆధారమైన చెరువు కబ్జా గురవుతున్నా అధికార యంత్రాంగం కండ్లు మూసుకున్న కబోదిలా వ్యవహరిస్తున్నది… చెరువు నిండితే బంగారు పంటలు పండుతాయని కొండంత ఆశతో ఉన్న అన్నదాతల పొట్టకొడుతున్న వ్యాపారుల కొమ్ముకాస్తున్నది. సమైక్యవాదుల పాలనలో చెరువులు మట్టిదీపంతలుగా మారితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో చెరువులు, కుంటల ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి దాపురిస్తున్నది. గ్రామాల్లో పొలాలకు సాగునీరు లేక జనాలు వలసబాట పట్టిన రోజులు మళ్లీ వచ్చేటట్టుగా కనిపిస్తున్నది.
సర్వ మానవులకు జీవనాధారం జలమే.. జలం ఉంటేనే మనుగడ సాధ్యమని భావించిన బీఆర్ఎస్ సర్కారు చెరువుల పునరుద్ధరణకు అధిక నిధులు కేటాయించి పునర్జీవం పోసింది. అటువంటి చెరువులు మళ్లీ కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయని పల్లెజనం ఆందోళన చెందుతున్నది. మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలోని పడమటి చెరువు రియల్ వ్యాపారుల కబంద హస్తాల్లో చిక్కుకున్నది. వ్యాపారుల చెర నుంచి చెరువును విడిపించి న్యాయం చేయాలని ఆ గ్రామ అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
మంచాల, ఆగస్టు 13 : ఎన్నో ఏండ్లుగా పంటల సాగులో అన్నదాతలకు అండగా నిలుస్తున్న పడమటి చెరువు.. మట్టితో నిండిపోతున్నది. రియల్ వ్యాపారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిలో మట్టి పోసి చదును చేసి దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ఆరుట్ల గ్రామానికి వెళ్లే ప్రతి ఒక్కరికీ ముందుగా స్వాగతం పలికేది పడమటి చెరువు.. చెరువు శిఖం ఎకరా 20 గుంటలు ఉండగా, దానికి నీటి నిల్వ సామర్థ్యం గల ఎఫ్టీఎల్ సుమారు ఆరు ఎకరాల వరకు ఉన్నది.
ఆరుట్ల పడమటి చెరువు పక్కన సర్వే నంబర్ 1602 నుంచి 1621 వరకు 30 ఎకరాల పట్టా భూమి ఉన్నది. అందులో కొంత పట్టా భూమి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుండడంతో ఈ భూమిని రైతుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిని ఆక్రమించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భూముల ధరలకు రెక్కలు..
ఆరుట్ల పడమటి చెరువు పక్కన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ కంపెనీ పేరుతో భూమిని కొనుగోలు చేసి అందులో రోడ్లు వేయడంతో పాటు భూమిని చదును చేశారు. పడమటి చెరువుకు సుమారు ఎఫ్టీఎల్ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, అందులో కొంత మేర మట్టి పోసి చదును చేసి కబ్జా చేశారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా సర్వే చేసి వాటి వాస్తవ హద్దులను గుర్తించాల్సిన రెవెన్యూ, జల వనరుల శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం.
ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసిన వ్యాపారులు..
పడమటి చెరువులో గతంలోనే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్టీఎల్ పరిధి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఎవుసాన్ని పండుగ చేయాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం రాజకీయ నాయకుల అండదండలతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు. పడమటి చెరువు కబ్జా కోరల్లో చిక్కుకున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోకపోవడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడమటి చెరువులో మట్టి పోసి భూమిని చదును చేస్తున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఎఫ్టీఎల్ పరిధిలోని పోసిన మట్టిని తొలగించాలని గతంలోనే చెప్పామంటూ విషయాన్ని దాట వేశారు.