బొంరాస్‌పేట, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మంచి రోజులు రానున్నాయి. గత ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై పాఠశాలలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రతి పాఠశాలకు అటెండర్, పారిశుధ్య కార్మికుడిని నియమిస్తామని సీఎం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని వేసవి సెలవుల్లోగా పనులను పూర్తి చేయిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసి టీశాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించేలా చూస్తామని చెప్పారు. సీఎం ప్రకటనతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు ఉచిత కరెంటు ఇస్తే పాఠశాలలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తాం
వికారాబాద్ జిల్లాలో 1095 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 776 ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత, 176 ఉన్నత పాఠశాలలు ఉండగా 9 మాడల్ స్కూళ్లు, 18 కేజీబీవీలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం కింద మొదటి విడుతలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు కేటగిరి 7 కింద ట్రాన్స్‌కో సంస్థ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. యూనిట్‌కు రూ.7చొప్పున విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నది. ఒక్కో పాఠశాలకు సగటున నెలకు రూ.300 నుంచి రూ.800 వరకు కరెంటు బిల్లు వస్తున్నది. విద్యుత్ బిల్లులను పాఠశాలకు మంజూరయ్యే గ్రాంట్ల నుంచే చెల్లించేవారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్ బకాయిలు రూ.వేలల్లో పేరుకుపోవడంతో హెచ్ఎంలు వాటిని చెల్లించలేక వదిలేశారు. దీంతో కొన్ని పాఠశాలలకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో కరెంటు బిల్లులు చెల్లించే భారం తమపై ఉండదని, అవే డబ్బులను పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
నిత్యం పరిశుభ్రతే..
ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు, పారిశుధ్య కార్మికులను కూడా నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేక తరగతి గదులను మధ్యాహ్న భోజన కార్మికులే శుభ్రం చేస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసేవారు కూడా లేరు. ప్రస్తుతం అటెండర్లు, పారిశుధ్య కార్మికుల నియామకంతో ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం పరిశుభ్రత నెలకొంటుందని హెచ్ఎంలు అభిప్రాయపడుతున్నారు.
మంచి నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పాఠశాలకు నెలకు రూ.700 వరకు కరెంటు బిల్లు వస్తున్నది. పాఠశాలలకు వచ్చే గ్రాంట్లు తక్కువగా ఉండడంతో విద్యుత్ బిల్లులు చెల్లించడం భారంగా ఉండేది. ఫ్రీ కరెంటుతో ఆర్థిక భారం తగ్గుతుంది. అటెండర్లు, పారిశుధ్య కార్మికుల నియామకంతో పాఠశాలల్లో పారిశుధ్య సమస్యలు తీరుతాయి.
– శ్రీహరిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్‌పేట మండలం
సీఎం నిర్ణయం హర్షణీయం
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఉచిత కరెంటు సరఫరా చేస్తామని, అటెండర్లు, పారిశుధ్య కార్మికులను నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. పాఠశాలలకు కరెంటు బిల్లులు చెల్లించడం ఆర్థికంగా భారంగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో కరెంటు బిల్లుల భారం తప్పింది. అటెండర్లు, పారిశుధ్య కార్మికుల నియామకంతో పాఠశాలలు నిత్యం పరిశుభ్రతతో ఉంటాయి. డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుతో విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందుతున్నది.
– అనిల్‌కుమార్, పీఆర్టీయూ బొంరాస్‌పేట మండల అధ్యక్షుడు