రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దివంగత ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా
యువతకు ఉచితంగా స్టడీ మెటీరియల్
మహేశ్వరం, జూలై 14 : సీఎం కేసీఆర్ కృషి, ఆలోచన మేరకే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లాలశ్రీ గార్డెన్లో దివంగత పి.ఇంద్రారెడ్డి ట్రస్టు ద్వారా ఉచితంగా యువతకు స్టడీ మెటీరియల్‌ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయలను ఖర్చు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తి మెరిట్ ప్రకారం భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన దివంగత పి.ఇంద్రారెడ్డి జీవితం ఎందరికో ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని బంగారు భవితకు బాటలు వేయాలని ఆమె కోరారు. తుక్కుగూడలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసి టెక్నికల్ విద్యకు అవకాశం కల్పిస్తున్నామని ఆమె తెలియజేశారు.
కార్యక్రమంలో పీజేఆర్ విద్యా కోచింగ్ సెంటర్ చైర్మన్ జగదీశ్‌రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు, రెడ్డిగళ్ల సుమన్, బూడిద తేజస్విని శ్రీకాంత్‌గౌడ్, బాదావత్ రవినాయక్, మున్సిపాలిటీ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్ రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మ భాస్కర్‌రెడ్డి, జైత్వారం ఎంపీటీసీ సురేశ్, మహేశ్వరం, కందుకూరు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.