‘సీఎం కేసీఆర్‌తోనే మనకు భవిష్యత్తు ఉంటుంది.. ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి షాబాద్, మొయినాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాబాద్ మండలంలో పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల దేశమంతా షాబాద్ వైపు చూస్తున్నదన్నారు. లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లలోకి చేరాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.500 పింఛన్ ఇచ్చేందుకు ఎన్నో నిబంధనలు పెడుతున్నారని, రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసే కూలీల వీడియోలు తీసి గోసపెడుతున్నదన్నారు. కేంద్రం ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాల జాడ ఏదని ప్రశ్నించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యాదయ్య కృషి చేస్తున్నారని ఏమైనా రోడ్లు మిగిలి ఉంటే నిధులు వచ్చేలా కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
షాబాద్/మొయినాబాద్, ఏప్రిల్ 16 : కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ నుంచి నాగిరెడ్డిగూడ మీదుగా బాకారం వరకు రూ.13కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు, చిన్న మంగళారం-గోపులారం గ్రామాల మధ్య మూసీ వాగుపై రూ.5కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు, నక్కలపల్లి-హైతాబాద్ గ్రామాల మధ్య ఈసీ వాగుపై రూ.5కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ-పామెన గ్రామాల మధ్య ఈసీ వాగుపై రూ.5కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు కుండలు, ఖాళీ బిందెలతో తిప్పలు పడేటోళ్లని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకం ద్వారా గోదావరి, కృష్ణాజలాలు తీసుకువచ్చి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రెండేండ్లపాటు కరోనా లేకపోతే ఇంకా అభివృద్ధి చెందేదని తెలిపారు. గత పాలకుల హయాంలో కరెంట్ సక్రమంగా లేకపోవడంతో బోరు మోటర్లు కాలిపోయేవని.. వాటితో అసెంబ్లీ ఎదుట రైతులు ధర్నాలు చేసిన సంఘటలున్నాయని చెప్పారు. 70 ఏండ్లలో ఏ ప్రభుత్వాలూ చేయలేని పనులను 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. అర్హులందరికీ నెలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఆసరా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి ద్వారా ఒక మేనమామగా రూ.లక్షా116 అందించి ముఖ్యమంత్రి ఆదుకుంటున్నట్లు చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
దేశం చూపు.. షాబాద్ వైపు..
నిరంతర విద్యుత్ సరఫరాతో రంగారెడ్డి జిల్లాతోపాటు షాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలతో దేశమంతా షాబాద్ వైపు చూస్తున్నదన్నారు. గతంలో కరెంట్ సక్రమంగా లేకపోవడంతో కంపెనీలన్నీ మూతపడేవని, దుకాణాల్లో జనరేటర్లు పెట్టుకుని నడిపించుకునేవారని చెప్పారు. గతంలో రూ.లక్షల్లో ఉన్న భూముల ధరలన్నీ నేడు రూ.కోట్లల్లో పలుకుతున్నాయన్నారు. కేసీఆర్ వచ్చినంక అభివృద్ధిని ప్రజలందరూ గ్రహించాలని సూచించారు. డ్వాక్రా సంఘాలకు గతంలో రూ.10వేలు ఇస్తే ఎక్కువ అయ్యేదని, నేడు రూ.లక్షల్లో రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణాలు కూడా బ్యాంకుల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు.
గోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.500 పింఛన్ ఇస్తున్నారని, అందులో కూడా స్లాబ్ ఇండ్లకు, వాహనం ఉంటే, ఎకరం భూమి ఉన్నవారికి పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పనీ చేయడం లేదని, ఉపాధి హామీ పనులు చేసేవారిని ఎంతో గోసపెడుతున్నదని మంత్రి మండిపడ్డారు. ఉపాధి హామీ పనులు చేసే సమయంలో కూలీల వీడియోలు తీసి పనులు సక్రమంగా చేయడం లేదని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించగా.. ఐదేండ్లుగా కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదన్నారు. తెలంగాణలో ఉద్యోగాల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు.. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటివరకు ఎందుకు ఇయ్యలేదని మంత్రి ప్రశ్నించారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే మనకు భవిష్యత్తు ఉంటుందని, రాష్ర్టాభివృద్ధితోపాటు అందరం బాగుపడుతామని మంత్రి సూచించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యాదయ్య సీఎం దగ్గర కూర్చుని సమస్యలు వివరించి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకుంటున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గానికి రూ.114కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మీ కోసం పోరాటం చేసే వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం సంతోషకరమని చెప్పారు. ఇంకా ఏమైనా రోడ్లు మిగిలిపోయి ఉంటే తన దృష్టికి తీసుకువస్తే నిధులు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమ్మరిగూడ నుంచి మామిడిపల్లి వరకు బీటీ రోడ్డు, బోనగిరిపల్లి వరకు ఫార్మేషన్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని కేతన మంత్రికి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, జడ్పీటీసీలు అవినాశ్‌రెడ్డి, శ్రీకాంత్, ఎంపీపీలు ప్రశాంతిరెడ్డి, నక్షత్రం, వైస్ ఎంపీపీలు లక్ష్మి, మమత, సర్పంచులు శకుంతల, సంధ్య, సుకన్య, స్వప్న, మనోజ్‌కుమార్, ఎంపీటీసీలు సునీత, సుజాత, మల్లేశ్, రవీందర్, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు శ్రీరాంరెడ్డి, నర్సింహగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంపీడీవోలు సంధ్య, అనురాధ, పీఆర్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ శ్రీదివ్య, మాజీ జడ్పీటీసీలు అనంతరెడ్డి, రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వెంకటయ్య, రాజేందర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్లు మధుసూదన్‌రెడ్డి, శ్రీహరియాదవ్, మాజీ ఎంపీటీసీ పాండు, పార్టీ నాయకులు రమేశ్‌యాదవ్, కృష్ణగౌడ్, రామస్వామి, నర్సింహులు, హనుమంతుయాదవ్, మునీర్, చెన్నయ్య, మహిపాల్, నరోత్తంరెడ్డి, మంజుల, రాజు, రవియాదవ్, ఆంజనేయులుగౌడ్, శ్రీనివాస్, రత్నం, నీలకంఠం, శ్రీశైలం, పరమేశ్, వెంకటేశ్. రాఘవేందర్, రాజుగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంపెనీల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. 14 ఏండ్లు నిరంతరం పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ వస్తే ఏమెస్తది అంటే.. నేడు జరుగుతున్న అనేక అభివృద్ధి పనులే నిదర్శమన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఈసీ, మూసీ వాగులపై ఆరు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు అందించిందన్నారు. తిమ్మారెడ్డిగూడ గ్రామ ప్రజలకు ఎన్నో ఏండ్లుగా ఈసీ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని, వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. సుమారు 20 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. నవాబుపేట మండలంలో రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. షాబాద్ మండలంలో పెద్దపెద్ద కంపెనీలు ఏర్పాటు అవుతుండడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని, రైతులెవరూ భూములు అమ్ముకోవద్దని సూచించారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులన్ని దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.