వికారాబాద్, డిసెంబర్ 12 : లగచర్ల ఘటనలో అరస్టై సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు గుండెపోటు రాగా అతడిని జైలు నుంచి దవాఖానకు తరలించే సమయం లో పోలీసులు చేతులకు బేడీలు(సంకెళ్లు) వేయడం అత్యంత క్రూరత్వమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
హీర్యానాయక్‌కు ఇంతకుముందే గుండెపోటు వచ్చిందని.. అతడికి ప్రభుత్వం సరైన చికిత్స అందించకపోవడంతో మళ్లీ గుండెపోటు వచ్చిందన్నారు. రైతును రాజు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు బేడీలు వేసి హీనంగా చూస్తున్నదని మండిపడ్డారు. రైతుకు సంకెళ్లు వేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.