ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ బిల్లులను చెల్లించాలని అడిగితే పోలీసులతో మాజీ సర్పంచ్లను అరెస్టు చేయించడం దారుణమని పలువురు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిగి నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరడంతోపాటు.. ఆయన పర్యటనను అడ్డుకుంటారనే సాకుతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాలకు తరలించడం దారుణమన్నారు.
కులకచర్ల : పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని చాపలగూడెం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, అంతారంతండా మాజీ సర్పంచ్ రవిలాల్, బిందెంగడ్డతండా మాజీ సర్పంచ్ తుల్జానాయక్, ఘనాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్, ఎత్తుకాల్వతండా మాజీ సర్పంచ్ లోక్యానాయక్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి అప్పుల పాలు అయ్యామని.. వాటిని చెల్లించాలని కోరితే ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించ డం తగదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిగి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరడంతోపాటు.. ఆయన పర్యటనను అడ్డుకుంటారనే సాకుతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కులకచర్ల ఠాణాకు తరలించడం దారుణమన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
నందిగామ : పెండింగ్ బిల్లులను చెల్లించాలని అడిగితే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దారుణమని సర్పంచ్ల సంఘం రంగా రెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు జిల్లెల వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, వెంకట్రెడ్డిని నందిగామ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో సర్పంచ్ల సంఘం మండల ఉపాధ్యక్షుడు గోవింద్ అశోక్ తదితరులు ఉన్నారు.
కొందుర్గు : పెండింగ్ బిల్లులు అడిగితే పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం సరికాదని సర్పంచ్ల సంఘం చౌదరిగూడ మండలాధ్యక్షుడు బాబురావు అన్నారు. మంగళవారం బాబురావును పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులను అడిగితే అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
దోమ : ముందస్తు అరెస్టులను నిలుపుదల చేసి మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఉద యం పోలీసులు రాజిరెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్కు వెళ్లొద్దని ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం : పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టినా ఇప్పటికీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించలేదని సర్పంచ్ల సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాయపోల్ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్రెడ్డి, తులేకలాన్ మాజీ సర్పంచ్ యాదగిరి అన్నారు. మంగళవారం మాజీ సర్పంచ్లను అరెస్టు చేసి పోలీసులు ఇబ్రహీంపట్నం ఠాణాకు తరలించగా.. వారు అక్కడ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రూ.1200 కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, పెండింగ్ బిల్లులు విడుదల చేసేంతవరకు సర్పంచ్ల పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.