వికారాబాద్, డిసెంబర్ 4: నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని అండగా ఉంటానన్నారు. ఓటమిని గుణపాఠంగా తీసుకొని ప్రజల మెప్పు పొందేందుకు కృషి చేస్తామన్నారు.
వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామ న్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేస్తానన్నారు. ప్రజలు మార్పును కోరుకున్నారని తిరిగి వారి మెప్పును పొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో సహకరించిన అందరికీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, నాయకులు దేవదాస్, రాజ్‌కుమార్, రమణ, చంద్రశేఖర్ రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.