పరిగి, మార్చి 2 : కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు మాని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. ఆ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలో మొదట నీరు వచ్చేది పరిగి సెగ్మెంట్కేనన్నారు. శనివారం సాయంత్రం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రెండు ప్యాకేజీలకు టెండర్లు, అలైన్మెంట్ సైతం పూర్తయిందని వెంటనే అగ్రిమెంట్ చేస్తే నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల నీరు పరిగి నుంచే మిగతా నియోజకవర్గాలకు వెళ్తాయన్నారు.
ఇటీవల కోస్గి సభలో నారాయణపేట్ ఎత్తిపోతలను సీఎం మంజూరు చేశారని, పాలమూరు ఎత్తిపోతల పనులనూ త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. రాజకీయాలనేవి ఎన్నికల సమయంలోనే ఉండాలని, తర్వాత ప్రజల శ్రేయస్సుకు పని చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌లో రెండు, మూడు పిల్లర్లు కుంగిపోతే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం తగదన్నారు. వెంటనే కుంగిన పిల్లర్లను బాగు చేసి అన్నదాతలకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 80శాతం వరకు పనులను పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి.. ఎక్కడా తట్టెడు మట్టిని కూడా తీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. వికారాబాద్ జిల్లాకు చెందిన వారే కావడంతో రాజకీయాలకతీతంగా పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేయించాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాయన్నారు. కేసీఆర్ హయాంలో రెండు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ర్పచారమంతా తప్పని ఖండించారు. మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జగత్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.