ఆమనగల్లు, డిసెంబర్ 20 : ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. మున్సిపల్ అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో గిరిజన సంఘాల రాష్ట్ర నాయకుడు , బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో ఆమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బస్తీబాట కార్యక్రమాన్ని 15వ వార్డులో వార్డు ఇన్చార్జి రఘు, మహేశ్నేత అధ్యక్షతన నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరై ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, గాంధీ విగ్రహం ముందున్న చెత్తను ఊడ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 వార్డులో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల బాకీ కార్డు, గత మున్సిపల్ బీజేపీ కార్యవర్గం చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ ..ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించకున్నా మున్సిపాలిటీ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేయకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తు న్నా ఆమనగల్లు మున్సిపాలిటీలో వారు చేసిన అభివృద్ధి ఏమిలేదని అంతా శూన్యమన్నారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో నూతన సర్పంచ్‌లుగా ఎన్నికైన శ్రీనూనాయక్, సత్యం, రాంచందర్‌లను మాజీ ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.
ఆమనగల్లు మున్సిపాలిటీలో నివసిస్తున్న సింగంపల్లి గ్రామానికి చెందిన అంజయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ స్థానిక నాయకులతో కలిసి అక్కడికెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబానికి సింగంపల్లి సర్పంచ్ సత్యం రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నిరంజన్‌గౌడ్, సర్పంచులు శ్రీనూనాయక్, సత్యం, రాంచందర్‌నాయక్ వెంకటేశ్, బాలస్వామి, సాయిలు, రమేశ్, సైదులుగౌడ్, రమేశ్, రమేశ్‌నాయక్, కిరణ్, సతీశ్, యాదయ్య, గణేశ్, జగన్, శివకుమార్, హుమ్లానాయక్, పంతూనాయక్, శ్రీకాంత్, మల్లేశ్, గోపి, పరమేశ్, లలితమ్మ, శివలీల, భాస్కర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.