రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చి రైతుల భూములను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాల అన్నదాతలు బుధవారం సాగర్ రహదారిలోని అన్నెబోయినపల్లి వద్ద సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో మాడ్గుల మండలంలోని అన్నెబోయినపల్లి, పాత బ్రాహ్మణపల్లి, కొత్త బ్రాహ్మణపల్లి, కలకొండ, చంద్రయాన్‌పల్లి, మాడ్గుల, నల్లచెరువు తదితర గ్రామాల నుంచి బాధిత రైతులు వందలాదిగా అన్నెబోయినపల్లికి తరలివచ్చారు.
అన్నెబోయినపల్లి గేటు వద్ద ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో వందలాదిగా పోలీసులు మోహరించారు. అన్నెబోయినపల్లి నుంచి సాగర్ రహదారి వరకు ర్యాలీగా అన్నదాతలు వస్తారని తెలుసుకుని అప్పటికే అన్నెబోయినపల్లి రోడ్డుకు అడ్డంగా తాళ్లతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రైతులు ఏమాత్రం లెక్కచేయకుండా సాగర్ రహదారిపై రాస్తారోకోకు నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు, అన్నదాతలకు పెద్దఎత్తున తోపులాట జరిగింది.
పోలీసుల ఆంక్షలను కూడా లెక్కచేయకుండా రైతులు బలవంతంగా వారిని పక్కకు తోసేసి సాగర్ రహదారి పైకి చేరుకుని బైఠాయించారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, బీఆర్ఎస్ మాడ్గుల మండల నాయకుడు జైపాల్‌రెడ్డి, రైతు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు నిలిచారు. రాస్తారోకోకు అనుమతి లేదని పోలీసులు ఆందోళనకు దిగిన అన్నదాతలను బలవంతంగా లొక్కొచ్చి పోలీసు వ్యాన్లలో ఎక్కించారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్యను కూడా పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి యాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ బాధిత రైతులు మాత్రం మళ్లీ వ్యాన్లలో నుంచి దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్లలో పడేసారు. మహిళా రైతులను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం బలవంతంగా తమ భూములను లాక్కుని తమకు ఉపాధి లేకుండా చేస్తున్నదని, తమకు మద్దతు ఇవ్వాలని బాధిత అన్నదాతలు పోలీసులను అభ్యర్థించారు. మీరు కూడా రైతు కుటుంబంలో నుంచి వచ్చినవారే.. భూమి లేకపోతే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అన్నదాతలు ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు వారిని బలవంతంగా అరెస్టుచేసి యాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బంధువుల ప్రయోజనాల కోసమే పేద రైతులను బలిచేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సాగర్ రహదారిపై ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు తయారుచేసిందని, అప్పట్లో రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అలైన్‌మెంట్‌ను మార్చడంతో మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు మండలాలకు చెందిన వేలాదిమంది సన్నచిన్నకారు రైతులు భూములు కోల్పోతున్నారన్నారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించి, కొత్తగా ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రిపుల్ఆర్ ఏర్పాటు పేరుతో అలైన్‌మెంట్‌ను మార్చి పేదల భూములను బలవంతంగా లాక్కోవాలనుకోవడం సమంజసం కాదని సీపీఎం రంగారెడ్డిజిల్లా కార్యదర్శి యాదయ్య అన్నారు. అన్నెబోయినపల్లి వద్ద రైతుల ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో రహదారుల పేరుతో ప్రభుత్వం పేదరైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నదన్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న వేలాదిమంది రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం వలన ఉపాధి లేక వారు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్కారు వెంటనే అలైన్మెంట్ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు రైతుల పక్షాన తాము పోరాటం కొనసాగిస్తామన్నారు.