ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తున్నది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. టీచింగ్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలనూ పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి తరగతులను ప్రారంభించేందుకు సన్నాహా లు జరుగుతున్నాయి. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేయగా.. దీని వెనుక ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కృషి ఎంతో ఉన్నది. కళాశాల నిర్మాణానికి అప్పట్లోనే ప్రభుత్వం రూ.176 కోట్లకు పరిపాలనా అనుమతులను ఇచ్చింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతోపాటు సామాన్యులకూ మెరుగైన వైద్యాన్ని అందించాలన్న కేసీఆర్ సంకల్పం సాకారమవుతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది..
-రంగారెడ్డి, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ)
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా గత ప్రభుత్వంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి మంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరంలో కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే మంజూరు చేశారు. కాలేజీ నిర్మాణానికి సంబంధించి రూ.176 కోట్లకు పరిపాలనా అనుమతులనూ ఇచ్చారు. మహేశ్వరం సెగ్మెంట్ కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలోని సర్వేనంబర్ 112లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదించగా.. టీఎస్ఐఐసీ 20 ఎకరాల ప్రభుత్వ భూ మిని కేటాయించింది. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి, 450 పడకల దవాఖాన భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావ డం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం తో కళాశాలకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయింది.
అనుమతుల్లో జాప్యం..
మహేశ్వరం మెడికల్ కాలేజీకి అనుమతులివ్వడంలో ఎడతెగని జాప్యం జరిగింది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. అలాగే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే దవాఖానలో బెడ్లతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది జూన్‌లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్‌తోపాటు సరైన సౌకర్యాలు లేవంటూ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు బదిలీలు చేపట్టడంతోపాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇచ్చింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ప్రభుత్వం ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. అయితే ప్రభు త్వం మొత్తం 8 కాలేజీలకు అనుమతుల కోసం ప్రయత్నించగా.. కేవలం నాలుగింటికి మాత్రమే అనుమతులొచ్చాయి. మహేశ్వరం కాలేజీకి మరోసారి భంగపాటు కలగడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అన్ని లోపాలను సరిదిద్ది సెకండ్ అప్పీల్‌కు వెళ్లింది. కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అన్ని అంశాలను పునః పరిశీలించిన ఎన్ఎంసీ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుమతులకు ఆమోద ముద్ర వేసింది.
అక్టోబర్‌లో తరగతులు ప్రారంభం..
ఈ ఏడాదిలోనే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. అక్టోబర్ 14 నుంచి తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి ఏడాది తరగతులకు సంబంధించి 50 మెడికల్ సీట్ల భర్తీతోపాటు ఇతర ప్రక్రియలను సంబంధిత అధికారులు వేగంగా చేపడుతున్నారు. మెడికల్ కాలేజీకి పక్కా భవనం లేకపోవడంతో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ని మంగల్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీ భవనంలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య విద్యార్థులకు వనస్థలిపురం ఏరి యా దవాఖానలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం వంద పడకలు ఉన్న దవాఖాన సామర్థ్యాన్ని 220 పడకలకు పెంచుతున్నారు.
అనుమతులు రావడం హర్షణీయం
మహేశ్వరం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు రావడం సం తోషకరం. ప్రజలందరూ ఆరోగ్యం గా ఉండేలా కేసీఆర్ ముందుచూపు తో పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పా టు చేశారు. ఎల్బీనగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానను అందుబా టులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. మహేశ్వరం మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో 450 పడకల దవాఖాన అందుబాటులోకి రానున్నది. దానివల్ల ఇక్కడి ప్రజలు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెడికల్ కాలేజీని మంజూరు చేసిన మాజీ సీఎం కేసీఆర్, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన హరీశ్‌రావు, అనుమతులు వచ్చేలా కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖల మం త్రి రాజనర్సింహలకు కృతజ్ఞతలు. గత ప్రభుత్వంలోనే రూ.176 కోట్లకు పరిపాలనా అనుమతులు వచ్చినందున వెంటనే కాలేజీ నిర్మాణ పనులను చేపట్టి.. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి.
-సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే