ఆమనగల్లు, జూన్ 4 : 30 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై ఉనికికే ముప్పు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
గురువారం వెల్డండ మం డలంలోని కొట్ర సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు జరిగింది. దీనికి పార్లమెంట్ సభ్వత్వాల జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జి రజనీసాయిచంద్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంకటేశ్‌తో కలిసి సబితారెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఏపీలోని టీడీపీ, తెలంగాణలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ఒకే డైరెక్షన్లో పనిచేస్తూ తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ..పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇచ్చేందుకు మనసు రాదు కాని బనకచర్ల ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు మాత్రం మూడు పార్టీలు సహకరించుకుంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30నెలలు దాటుతున్నా.. ఇప్పటివరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపాయి విదల్చలేదని.. తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. పీఆర్ఎల్ఐ పరిస్థితిని చూసిన బీఆర్ఎస్ ప్రాజెక్టుల పూర్తి కో సం ప్రాజెక్టుల పాదయాత్రకు కార్యాచరణ ప్రకటించగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందని ఎద్దేవా చేశారు.
హడాహుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతి కోసం పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డీ.. నీవు నిజంగా తెలంగాణ, పాలమూరు బిడ్డవైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సబితారెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్టుల పూర్తికి నిధులు విడుదల చేసి టైంబాండ్లో పూర్తి చేయాలన్నారు.
ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోతే బీఆర్ఎస్ తిరిగి ప్రాజెక్టు సాధన పేరిట పోరాటాలకు శ్రీకారం చూడుతుందని మాజీ మంత్రి హెచ్చరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు ఎదైనా మేలు చేసిందంటే అది బీఆర్ఎస్ పోరాటాలతోనే అని ఆమె పలు ఉదాహరణలను ఉదహరించారు. మొద్దు నిద్ర పోతున్న రేవంత్ సర్కార్‌ను బీఆర్ఎస్ పార్టీ అంకుశంతో పొడుస్తూ మేల్కోలుపుతున్నదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి, ఆత్మగౌరవానికి కేసీఆరే శ్రీరామరక్ష అని. అందుకే పల్లెల నుంచి పట్నాల వరకు ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారు.
‘సర్’, సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించాలి
ఎస్ఐఆర్ ప్రక్రియలో, పార్టీ సభ్యత్వ నమోదులో బీఆర్ఎస్ కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ఓట్ల వడపోతలో గ్రామాల్లోని పోలింగ్ బూత్ ఇన్చార్జీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎడ్మ సత్యం, శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు పుట్టరాంరెడ్డి, అర్జున్‌రావు, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాస్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డి, దశరథ్‌నాయక్,సింగిల్‌విండో అధ్యక్షుడు జూపల్లి భాస్కర్‌రావు, గంప వెంకటేశ్, సూర్యప్రకాశ్‌రావు, ఎల్ఎన్రెడ్డి, షాహెద్, పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు.

పార్టీకి కార్యకర్తలు రక్షణ కవచంగా ఉండాలి
పార్టీకి కార్యకర్తలు రక్షణ కవచంగా ఉండాలి. గతంలో లాగా సభ్యత్వాల నమోదు ఉండదు. డిజిటల్ విధానంలో ఉంటుంది. ఇండ్ల వద్దేకు వెళ్లి సభ్యత్వాలను నమోదు చేస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో తెలిసిపోతుంది. ఎస్ఐఆర్ విషయంలో బూత్‌ల వారీగా ఇన్చార్జీలు జాగ్రత్తగా ఉండాలి. పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా మార్పులు చేర్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
-మెట్టు శ్రీనివాసులు, సభ్యత్వాల జిల్లా ఇన్చార్జి
కృష్ణానదిలో తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలి
డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ గురించి వివరించారు. అనంతరం పలు తీర్మానాలు చేసి సమావేశంలో ఆమోదింపజేశారు. కృష్ణానదిలో తెలంగాణకు 500 టీఎంసీలు, భీమా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించడంతోపాటు 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అలాగే, నెట్టెంపాడుకు 25 టీఎంసీ కేటాయించి 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు.. కోయిల్‌సాగర్‌కు 5 టీఎంసీలు కేటాయించి 50 వేల ఎకరాలకు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 50 టీఎంసీలు కేటాయించి 5 లక్షల ఎకరాలకు, పాలమూరు -రంగారెడ్డికి 120 టీఎంసీల నికర జలాలు కేటాయించి, 12.30 లక్షల ఎకరాల్లో పాత పాలమూరుకు 7 లక్షల ఎకరాలకు, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ, దేవరకొండ, మునుగోడు నియోజకర్గాల ఇవ్వడమే కాకుండా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలను ఆమోదించారు.
కొడంగల్-నారాయణపేట లిఫ్ట్‌ను చేపట్టాలని, ఆర్డీఎస్ తుంగభద్రను పూర్తి చేసి గద్వాల, అలంపూర్లకు 90 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతోపాటు తుమ్మిళ్ళ, గట్టు ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీని పూర్తి చేసి అచ్చంపేట నియోజకర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు ఇవ్వడం.. కల్వకుర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేయడం, మెట్రోను శంషాబాద్‌నుంచి కల్వకుర్తి వరకు పొడించాలని తీర్మానించారు. రేవంత్‌రెడ్డి నిజంగా పాలమూరు బిడ్డ అయితే పై తీర్మానాలను పరిగణనలోకి తీసుకోని అమలు చేయాలని జైపాల్‌యాదవ్ డిమాండ్ చేశారు.అంతకు ముందు పార్టీ జెండాను ఎగరువేసి కార్యకర్తల అవగాహన సదస్సు ప్రారంభించారు.
-జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి
సభ్యత్వ నమోదులో నంబర్‌వన్‌గా నిలవాలి
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టే. పార్టీ మరింత బలంగా మారాలంటే సభ్యత్వాలలో నంబర్‌వన్‌గా నిలవాలి. ఎస్ఐఆర్, వాటి నిబంధనలను కార్యకర్తలు తెలుసుకోవాలి. రాష్ర్టానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో అవసరం.
-వేద రజనీసాయిచంద్, కల్వకుర్తి నియోజకవర్గ సభ్వత్వాల ఇన్చార్జి
నాయకులు, కార్యకర్తలు ‘సర్’పై మరింత అవగాహన పెంచుకోవాలి
సభ్వత్వాల నమోదులో కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచుతాం. కార్యకర్తలు, నాయకులు ఎస్ఐఆర్పై మరింత అవగాహన పెంచుకోవాలి.
-గోలి శ్రీనివాస్‌రెడ్డి, పుడ్ కమిషన్ చైర్మన్