షాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ అంటేనే కేసీఆర్ అని.. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. సోమవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమెతోపాటు బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్సీలు దయానంద్‌గుప్తా, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్తు చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా జిల్లాకే కాకుండా కమ్యూనిటీకి కూడా సేవలు చేస్తూ 96 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంత మంచి వ్యక్తిని ఎన్నికల బరిలో నిలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలు బాగుండాలని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ఏం చేశారని అనేవారు ఒక్కసారి ఆలోచించాలన్నారు. స్వరాష్ర్టానికి ముందు 7గంటలు వచ్చే కరెంట్‌ను 24గంటలకు పెంచింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో రైతుబంధు తీసుకొచ్చి ఏటా నగదు సాయం అందించారన్నారు. ఇంట్లో నీళ్లు తాగేటప్పుడే అందులో కేసీఆర్ కనిపిస్తారన్నారు.
జిల్లాల కలెక్టరేట్లు, రైతు వేదికలు నిర్మించారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒక భరోసా ఉండేదని, మూడు నెలల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెళ్లిపోయినా పార్టీకి ఒరిగేదేమీలేదన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదా మరిచి మాట్లాడుతున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసి రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ కొంత భాగానికి సాగునీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ ధన్యమవుతుందని, కేసీఆర్ చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు. షాబాద్ మండలంలోని చందనవెల్లిలో కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన్నట్లు తెలిపారు. టెక్నికల్‌గా సమస్య లేకుండా 111జీవో తీసేసి విధంగా కొత్త జీవో తీసుకువచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పగలరా అని మాజీ మంత్రి సబితారెడ్డి ప్రశ్నించారు. మోదీని చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్న బీజేపీ నాయకులు.. మోదీ తెలంగాణకు చేసిన మేలేంటో చెప్పాలన్నారు. దేవుడి పేరు, మతం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవడమే బీజేపీ వాళ్ల పని అన్నారు. నిజంగానే తెలంగాణపై బీజేపీకి అంతా ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
వెయ్యి రూపాయల నోటు రద్దు చేసినప్పుడు నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్క రైతు అకౌంట్లో రూ.15లక్షల చొప్పున వేస్తామని మోదీ చెప్పారని, అవి వేసినంకనే బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్లకు వస్తున్నారని, ఆ రోజు మనమందరం తరలివెళ్లి మేమంతా మీ వెంట ఉన్నామని నిరూపించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె జయమ్మ, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, ఎంపీపీలు గోవర్ధన్‌రెడ్డి, కాలె భవాని, వేతనాల మండలి మాజీ చైర్మన్ నారాయణ, మాజీ ఎంపీపీ మంగలి బాల్‌రాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మిట్ట వెంకటరంగారెడ్డి, గూడూరు నర్సింగ్‌రావు, డాక్టర్ ప్రశాంత్‌గౌడ్, పాపారావు, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, గోపాల్, నాగిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, పోలీస్ రాంరెడ్డి, చిట్టెం మల్లారెడ్డి, శేరిగూడెం వెంకటయ్య, జడల రాజేందర్‌గౌడ్, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, రామగౌడ్, శేరి శివారెడ్డి, మంగలి యాదగిరి, కుమ్మరి దర్శన్, యా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. కేసీఆర్ తెచ్చిన మిషన్ భగీరథ నీళ్లనూ ప్రజలకు సరిగ్గా అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. తెలంగాణ వచ్చినంక కొండా వెంకటరంగారెడ్డి మనుమడు, ఈ జిల్లాకు వారసుడని కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తీసుకువచ్చి ఎంపీగా చేస్తే, ఆయన ఇక్కడి ప్రజలకు ఏం చేయలేదు. మరోవ్యక్తి రంజిత్‌రెడ్డి మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయారో అర్థం కావడం లేదు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఎన్నో సేవలు చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ నెల 13న చేవెళ్లలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు కార్యకర్తలంతా తరలివచ్చేందుకు సిద్ధం కావాలి.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
పార్టీలో పదవులు అనుభవించి, పార్టీని వదిలిపోయే వాళ్లంతా మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అలాంటి వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వారంతా వడ్లు తూర్పార పడితే కొట్టుకుపోయే తాలు గింజలు. మనం గట్టి వడ్లలాంటి వాళ్లం ఎప్పటికీ బీఆర్ఎస్లోనే ఉంటాం. విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలు రాకముందే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్లు పోయినంక పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఎన్నికల తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీని వదిలిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దు. బీసీ నాయకుడు కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
-మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అందించిన పథకాలను ప్రజలకు వివరించాలి. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు చెందిన బీసీ నేత, సీనియర్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. పేదలకు అందించిన పథకాలపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న విషయాలను ప్రజలకు వివరించాలి.
జ్ఞానేశ్వర్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి.
-దయానంద్‌గుప్తా, ఎమ్మెల్సీ
96 కులాలను కలుపుకొని వ్యవస్థను నడిపించిన కాసాని జ్ఞానేశ్వర్ గొప్ప వ్యక్తి. కార్యకర్తలే ఏ పార్టీకైనా వెన్నెముక. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలి. అధికారపక్ష నేతలు మాట్లాడే మాటలన్నీ నీటిమీద రాతలలాంటివి. పదేండ్లలో కరెంట్, తాగునీరు, విద్య, వైద్యం తదితర విషయాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. రాష్ట్రపతి భవన్లో తన తండ్రి పీవీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉన్నది.
-సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
చేవెళ్ల ఎంపీగా తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీనేతనైన నాకు పోటీ చేసే అవకాశం కల్పించారు. గతంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఎంతో సేవ చేశా. అప్పట్లో గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు అందించా. ఈ నెల 13వ తేదీన కేసీఆర్ చేవెళ్ల నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
-కాసాని జ్ఞానేశ్వర్,