ఇబ్రహీంపట్నం, జూలై 8 : ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గత నలభై ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్ల నిధులు కేటాయించి, మాజీ మంత్రి కేటీఆర్‌తో 2022 ఫిబ్రవరిలో భూమి పూజ చేయించారు. స్లాబ్ పనుల వరకు పూర్తయిన భవన నిర్మాణ పనులు తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ముందుకు సాగడంలేదు.
దీంతో శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో విధులకు ఇబ్బందులు కలుగుతున్నాయని రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రియాల్టర్లు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూమి పూజ చేసి నిర్మాణ పనులు చేపట్టిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో కోట్ల రూపాయలు వృథాగా పోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్కారు స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయంతోపాటు తహసీల్దార్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నారు.
అద్దె భవనంలో విధులు
ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలాపాలు గత 40 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో విధులు కొనసాగడం తీవ్ర ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. వానకాలంలో గోడలకు నిమ్ము వస్తుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన డాక్యుమెంట్లు కూడా తడిసిపోయే ప్రమాదమున్నది. ప్రభుత్వం స్పందించి నూతన భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయించాలని సిబ్బందితోపాటు పలువురు కోరుతున్నారు.
నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో భూమి పూజ చేసి పనులు చేపట్టారు. స్లాబ్ వరకు పూర్తయిన నిర్మాణ పనులను కాంగ్రెస్ సర్కారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో స్లాబ్ కూలిపోయే ప్రమాదమున్నది. ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయ పక్కా భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలి.
– మైలారం విజయ్‌కుమార్
కావాలనే దృష్టి సారించడంలేదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, సొంత భవనాల నిర్మాణాలకు సంబంధించిన పనులపై కాంగ్రెస్ సర్కారు కావాలనే దృష్టి సారించడంలేదు. ఎంతో ఉన్నతాశయంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలుండాలనే సంకల్పంతో కృషిచేసి సర్కారుతో పోరాడి నిధులు తీసుకువచ్చి పనులను ప్రారంభించారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ పనులపై దృష్టి సారించడంలేదు. వెంటనే ప్రభుత్వం చొరవ చూపి ప్రజావసరాల కోసం ఉపయోగపడే భవనాలను పూర్తిచేయించాలి.
– భరత్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్, ఇబ్రహీంపట్నం