వికారాబాద్, ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచితే జిల్లాలో కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో ఉంది. ప్రస్తుతం పచ్చదనాన్ని పెంచడం ఏమో కానీ, ప్రస్తుతమున్న అటవీ ప్రాంత విస్తీర్ణం, పచ్చదనం తగ్గకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, పెద్దేముల్, దోమ, కుల్కచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా చెట్లు నరికివేసి అక్రమంగా సంపాదిస్తున్నారు. కలప మాఫియా సంబంధిత ప్రాంతాల్లో యథేచ్ఛగా చెట్లను నరికి రహస్యంగా హైదరాబాద్‌తోపాటు కర్నాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
అయితే అక్రమంగా కలప రవాణాకు సంబంధించి అటవీ శాఖ సిబ్బందిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలప అక్రమ నరకివేతదారుల నుంచి మామూళ్లు తీసుకొని వెనుకుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని అటవీ శాఖ సిబ్బందిపై విమర్శలు వెలువడుతున్నాయి. కలప నరికివేతతోపాటు తరలింపునకు సంబంధించి అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు అధికారులు, రెవెన్యూ అధికారుల హస్తముందనే ఆరోపణలు స్థానిక ప్రజలు నుంచి వ్యక్తం అవుతున్నాయి.
యథేచ్ఛగా చెట్ల నరికివేత..
జిల్లాలోని కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, పెద్దేముల్, దోమ, కుల్కచర్ల మండలాల్లో చెట్లను నాశనం చేయడంతోపాటు అక్రమంగా కలపను తరలిస్తూ హరిత సంపదను కొల్లగొడుతున్నారు. సంబంధిత మండలాల్లోని పలు గ్రామాల్లో రోజూ చెట్లను నరికి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ కొందరు దళారులు దోచుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో చెట్లు నరికివేతకు గురవుతుంది. అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికి లారీలకు లారీల కలపను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చెట్లను నరికే వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లు అధికంగా ఉంటేనే మంచి వాతావరణం, సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. చెట్లను పూర్తిగా నరికివేస్తే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం మరిచారని ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు.
ముమ్మాటికీ అటవీ శాఖ అధికారులు, కట్టెల వ్యాపారం చేసే దళారులు కుమ్మక్కై ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా చెట్లను నరికి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో హైదరాబాద్, కర్నాటక ప్రాంతాలకు కలపను తరలిస్తున్నారు. ప్రధాన రహదారి అయిన వికారాబాద్, మన్నెగూడ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి కాకుండా వికారాబాద్, నవాబుపేట్, శంకర్పల్లి సమీపం నుంచి హైవే మీదుగా కాటేదాన్ ప్రాంతంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు కలపను తరలిస్తున్నారు. నిత్యం ఈ దందా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
చూసీచూడనట్లు..
జిల్లాలోని ఏదో ఒక ప్రాంతం నుంచి అక్రమంగా కలపను తరలిస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్రమ కలప తరలింపు వ్యవహారమంతా అటవీ శాఖ అధికారులకు తెలిసే నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ జిల్లాలోని అక్రమంగా కలపను తరలిస్తున్నప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. పత్రికల్లో వార్తలు వస్తే రెండు, మూడు రోజులు తనిఖీలు చేసి తర్వాత యథావిధిగా చూసీచూడనట్లు ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. కలప మాఫియా నుంచి నెలనెలా ఫారెస్ట్ బీట్ అధికారులు మొదలుకొని రేంజ్ అధికారులు, జిల్లా అధికారి వరకు రూ.లక్షల్లో మామూళ్లు వెళ్తున్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కలప మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు అటవీ శాఖ అధికారులపై ఉంది.