మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పూడూరు,డిసెంబర్ 23 : మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు అయినట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ మల్లేశం అధ్య క్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామాల్లోని రైతులకు రైతు బంధు దరఖాస్తుపై అవగాహన కల్పించి ఆన్లైన్లో చేసు కునేలా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని సర్పంచ్‌లు అనంతరెడ్డి, శ్రీధర్‌గుప్త, పెంటమ్మ, ఎంపీటీసీలు లక్ష్మణ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, విద్యుత్ ఏఈ ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఫారెస్ట్ అధికారులు రైతుల పోడు భూములను పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా ప్రజా ప్రతి నిధులు చూడాలని తెలిపారు.
బీటీ రోడ్ల నిర్మాణ కోసం టెండర్లు వేశారని త్వరలో పనులు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. మధ్యలో నిలిచిపోయిన భవనాల నిర్మాణంతో పాటు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంకోసం రూ.10 కోట్ల నిధులు ఎమ్మెల్యే మంజూరు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ మేఘమాల మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుంచి పలు గ్రామాల పాఠశాల నూతన భవనాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను సర్పంచ్‌లు త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్య క్రమంలో వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు బుచ్చన్న, పాపయ్య, గోపాల్, ఎంపీ టీసీ నాగమణి, సల్మాబేగం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.