తాండూరు, డిసెంబర్ 13 : తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థినుల్లో 9 మందిని తాండూరు జిల్లా దవాఖానకు, మరొక విద్యార్థిని నీలావతిని హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు శుక్రవారం తరలించారు. మూడు రోజుల పాటు హాస్టల్లోనే వైద్యం అందించిన డాక్టర్లు…జిల్లా దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. సర్కార్ దవాఖానలో విద్యార్థినులకు స్కానింగ్, రక్త పరీక్షలు చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తెలుపడంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాంతులు, విరోచనాలు కావడం వల్ల ఎనర్జీ లాస్ అయినట్లు తెలిపారు. మరో వైపు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు విద్యార్థిని నీలావతిని ఎందుకు తరలించారని తల్లిదండ్రులు అడుగగా డాక్టర్లు సమాధానం చెప్పకపోవడంతో తోటి విద్యార్థినులు అందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రుల ఒత్తిడితోనే దవాఖానకు..
ఉడికీఉడకని ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మూడు రోజులుగా పాఠశాలలోనే వైద్యం అందించారు. దవాఖానకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేయడం, బీఆర్ఎస్ మద్దతుతో ఆందోళన చేపట్టడంతో దవాఖానకు తరలించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారని, విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.