Hotels | సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మేడిపండు చూడు మేలిమై ఉండునూ.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా.. ధగధగలాడే మెరుపులతో హోటల్ ప్రవేశ ద్వారాలు స్వాగతం పలుకుతుంటే.. కిచెన్ రూంలో మాత్రం ఎలుకలు, ఎలుక విసర్జనాలు, గడువు ముగిసిన మసాలాలు ఉంటున్నాయి. వెరసి జనాల ఆరోగ్యం పాడు చేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఇవన్నీ వెలుగు చూశాయి.
గచ్చిబౌలిలో ది నవాబ్స్ రెస్టారెంట్లో వంటగది లోపల డ్రైనేజీ మూసుకుపోయి నీరు నిలిచిపోయినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. వంటింటి కిటికీలు, తలుపులకు పురుగుల నియంత్రణ లేదని తేల్చారు. స్టోర్ రూంలో ఎలుకల విసర్జన, ఎలుకలు తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లలో చికెన్, మటన్లపై లేబుల్ లేదని, దుకాణంలో దొరికే ఉల్లిపాయల పొడి, పెరి పెరి మిక్స్ కూడా లేబుల్ లేకుండా ఉన్నాయి. వంటగదిలో డస్ట్బిన్లను తెరిచే ఉంచారు. తెరిచి ఉన్న డస్ట్బిన్లను గుర్తించారు.
గచ్చిబౌలి ఇందిరా నగర్లో లా విన్ ఎన్ రోజ్ కేఫ్‌లో కిచెన్ ఫ్లోర్, కేక్ తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని తేల్చారు. గచ్చిబౌలిలోని బెర్లిన్ రెస్టారెంట్ అండ్ క్లబ్లో గడువు ముగిసిన పుట్టగొడుగులు, ఆపిల్ సైడర్ వెనిగర్, వెరుశనగ వెన్న, చైనీస్ మసాలా పొడి, నువ్వుల నూనె, మద్రాసు కరివేపాకు, మసాలా అల్లంపొడి, స్వీట్ కార్న్ వంటి పదార్థాలను సీజ్ చేశారు. రిఫ్రిజిరేటర్లో లేబుల్ లేని ఆహార పదార్థాలు కనిపించాయి. తెరిచి ఉన్న డస్ట్బిన్లు దర్శనం ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు.