భారీ వర్షాలతో వికారాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో జిల్లాలోని నీటి వనరులన్నీ నిండుకుండల్లా మారాయి. కోట్‌పల్లి, లక్నాపూర్, సర్పన్‌పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక్టులు దాదాపుగా నిండగా.. నేడోరేపో అలుగు పారనున్నాయి. జిల్లావ్యాప్తంగా 209 చెరువులు ఇప్పటికే మత్తడి దుంకుతుండగా.. మిగతావాటిలోనూ 50 నుంచి 75 శాతానికి పైగా నీరు నిల్వ ఉన్నది. జూలైలో సాధారణం కంటే 146 మి.మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహించడం.. చెరువులు, చెక్‌డ్యాంల్లో నీటి నిల్వలు పెరుగడంతో భూగర్భజలాలు కూడా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వచ్చే యాసంగికి సాగునీటి కొరత ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)
ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పలుచోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపుగా ఉమ్మడి జిల్లాలోని చెరువులు నిండి అలుగు పారుతుండగా, మరికొన్ని పూర్తిస్థాయిలో నిండి మత్తడి పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. చిన్న చిన్న వాగులు, వంకల నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పలుచోట్ల జనం చేపలు పట్టుకోవడం కనిపించింది. వరినాట్లు వేసుకోవడానికి పొలాలు అనువుగా ఏర్పడడంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు.
వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్, సర్పన్‌పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈ ప్రాజెక్టుల కింద సాగునీరందే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో భారీగా నీరొచ్చి చేరడంతో ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న భూములకు సరిపోను సాగు నీరందించనున్నారు. మరోవైపు భారీ వర్షాలకు పెద్ద ఎత్తున మూసీ, ఈసీ నదుల్లో వరద పొంగిపొర్లింది. దాదాపు అన్ని మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో చెప్పుకోదగిన వర్షాలు లేకపోయినప్పటికీ జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అన్ని మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
మత్తడి దుంకుతున్న 209 చెరువులు
జిల్లావ్యాప్తంగా 1179 చెరువులుండగా.. 85 వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. తాండూర్ డివిజన్లో 262, కొడంగల్ డివిజన్లో 202, పరిగి డివిజన్లో 398, వికారాబాద్ డివిజన్లో 317 చెరువులున్నాయి. జిల్లాలో 1126 చెరువులుండగా ఇప్పటివరకు 209 చెరువులు వర్షపు నీటితో నిండి మత్తడి దుంకుతున్నాయి. తాండూరు డివిజన్లో 59, పరిగి డివిజన్లో 44, కొడంగల్ డివిజన్లో 4, వికారాబాద్ డివిజన్లో 102 చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. ఇప్పటివరకు 309 చెరువుల్లో 75-100 శాతం నీటితో జలకళను సంతరించుకున్నాయి. తాండూరు డివిజన్లో 79, వికారాబాద్ డివిజన్లో 108, పరిగి డివిజన్లో 122 చెరువులు 75-100 శాతం నిండాయి. 321 చెరువుల్లో 50-75 శాతం నీటి నిల్వలు పెరిగాయి. వీటిలో తాండూరు డివిజన్లో 69, వికారాబాద్ డివిజన్లో 77, కొడంగల్ డివిజన్లో 5, పరిగి డివిజన్లో 170 చెరువులున్నాయి. 246 చెరువుల్లో 25-50 శాతం నీటి నిల్వలున్నాయి. వీటిలో తాండూరు డివిజన్లో 55, వికారాబాద్ డివిజన్లో 30, కొడంగల్ డివిజన్లో 101, పరిగి డివిజన్లో 60 చెరువులున్నాయి. మరో 94 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు ఉండగా.. కొడంగల్ డివిజన్లోని 92, పరిగి డివిజన్లో రెండు చెరువుల్లో 25 శాతం నీరున్నట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సొండేపూర్, మిట్టకోడూర్ చెరువుల్లో వరద నీటి ప్రవాహం పెరిగి గండిపడడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టారు.
రికార్డు వర్షపాతం
వానకాలం ప్రారంభమైన జూన్ నెలలో పెద్దగా వర్షాలు కురువకపోయినా వారం రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురువడంతో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూలైలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే 146 మి.మీటర్లకుపైగా అధికంగా వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 203 మి.మీ కాగా.. 308 మి.మీ నమోదు కావడం గమనార్హం. జూలైలో అత్యధికంగా కులకచర్ల మండలంలో 20 సెం.మీ రికార్డు వర్షపాతం నమోదైంది.
లఖ్నాపూర్ ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు
పరిగి, జూలై 22 ః తెరిపి లేకుండా మూడు రోజులపాటు కురిసిన వర్షాలతో పరిగి మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నది. ప్రాజెక్టులో 18 అడుగుల మేరకు పూర్తిస్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 16 అడుగుల వరకు వరద నీరు చేరాయి. గత మూడు రోజులుగా వాగుల ద్వారా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. వరద ప్రవాహం తగ్గకుండా ఉంటే ఆదివారం అలుగు పారే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం రెండు అడుగుల మేరకు నీరు వస్తే లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పారుతుంది. మండలంలోని మిట్టకోడూర్ చెరువు పూర్తిస్థాయిలో నీటితో నిండగా తూము నుంచి నీరు వెళ్తుండడంతో గడ్డి, ఇసుక బస్తాలు వేసి నీరు వృధా పోకుండా అడ్డుగా వేశారు. తూము మరమ్మతుతో ఈ ఇబ్బంది తీరనుంది.