తాండూరు, సెప్టెంబర్ 2: తాండూరు నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిల్వడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగ్నానది, కాక్రవేణి నదులు ఉప్పొంగుతున్నాయి. పలు చోట్ల కాలువలు తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లింది.
మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు చూచించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న స్థానిక నేతలు, అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. నీళ్లు ఎక్కువ నిలువుటకు కారణం తెలుసుకొని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తాండూరులో అక్రమ నిర్మాణాలతో పాటు చిలుకవాగు కబ్జాకు గురికావడాన్ని గమనించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిర్మాణలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. హైదరాబాద్ తరహా తాండూరులోనూ హైడ్రా అమలు చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి త్వరలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామన్నారు. ఇక మీదట వర్షం నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు, ఇండ్లు కూలిపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వర్షంతో పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. రైతులు, ప్రజలు చాల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైన పని ఉంటేనే బయటికి వెళ్లాలని సూచించారు.
పరిగి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో పరిగి మండలంలోని మెజారిటీ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులన్నీ వరద నీటితో ప్రవహి స్తున్నాయి. నియోజకవర్గంలోనే పెద్దదైన లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆదివారం సా యంత్రం నుంచి మత్తడి దుంకడం ప్రారంభమైంది. దీంతో పరిగి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రాజెక్టు అందాలు చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. మత్స్యకారులు చేపలు పడుతుండడంతో ప్రాజెక్టు ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
పరిగి మండల పరిధిలో మొత్తం 53 చెరువులుండగా సోమవారం వరకు 40 చెరువులు నీటితో నిండిపోయి మత్తడి దుంకుతున్నాయి. తద్వారా భూగర్భ జలమట్టం పెరిగేందుకు ఈ వర్షాలు దోహదం చేశాయని చెప్పవచ్చు. ఇదిలావుండగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాత ఇండ్లు కూలి పోతున్నాయి. గత రెండు రోజులుగా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్, చిగు రాల్పల్లి గ్రామాల్లో పది ఇండ్లు కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తెరిపి లేకుండా ఇలాగే వర్షాలు కురిస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదముంది. వర్షాలతో కాళ్లపూర్ తండాకు చెందిన అమ్రిబాయి ఇల్లు కూలిపోయింది.
వికారాబాద్: మండల పరిధిలోని ధ్యాచారం, గొట్టిముక్కల, మైలార్ దేవ రంపల్లి, నారాయణపూర్, ధన్నారం గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి 298 ఎకరాలు, మొక్కజొన్న 21, వరి 32, కందులు 34, కూరగాయలు 37, పసుపు 40 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, మండల వ్యవ సాయాధికారి జ్యోతి, వ్యవసాయ విస్తరణ అధికారి కావ్య పరిశీలించారు. అదే విధంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూర్గుపల్లిలో మిత్రమ్మ, కురువ సాయమ్మలకు చెందిన ఇండ్లు కూలిపోయాయి. మండల పరిధిలోని కామ రెడ్డిగూడలో రిక్కల నాగమణి ఇల్లు వర్షానికి కూలిపోయింది. అదే గ్రామానికి చెందిన కైలా రవీందర్‌రెడ్డి ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో ఇండ్లు కూలినట్లు కాలనీ వాసులు తెలిపారు.
బొంరాస్‌పేట : భారీ వర్షాలకు మండలంలోని ఏర్పుమళ్ల కాక్రవాణి ప్రాజెక్టు, బురాన్‌పూర్ చిన్నవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతుండగా, బొంరాస్‌పేట, మెట్లకుంట, తుంకిమెట్ల, కొత్తూరు, బురాన్‌పూర్ తదితర గ్రామాల్లోని చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చిన్న చిన్న కుంటలు కూడా నిండాయి. ఇదిలావుండగా మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. తుంకిమెట్ల గ్రామంలో మంగలి గోపాల్, మంగలి మహిపాల్, బ్యాగరి బసప్పలకు చెందిన ఇళ్లు వర్షానికి గోడలు తడిసి కూలిపోయాయి. కూలిన ఇండ్లను మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు తిరుపతయ్య సోమవారం పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మదన్‌పల్లిలో బొగ్గుల సాయమ్మకు చెందిన ఇల్లు వర్షానికి సోమవారం కూలిపోయింది. ఇళ్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లు కూలిపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
పూడూరు: మండల పరిధిలోని ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కంకల్ గ్రామ సమీపంలోని ఈసీ వాగు ఇరు పక్కల పొలాల్లో నీరు నిలిచింది. చన్గోముల్ వాగు సమీపంలోని కల్వర్టు పూర్తిగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. చన్గోముల్ వాగు నిండుగా పారడంతో బార్లపల్లి, మామిడిపల్లి, చన్గోముల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని తిమ్మపూర్ గ్రామంలో ఇల్లు కూలే స్థితిలో ఉన్నట్లు గుర్తించి ఓ కుటుంబాన్ని స్థానిక పాఠశాలల్లో ఉంచినట్లు మండల తహసీల్దార్ భరత్ తెలిపారు. వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చిన 97046 31328కు ఫోన్ చేయాలని తహసీల్దార్ సూచించారు.
ధారూరు: మండల పరిధిలోని రుద్రారం-నాగసముందర్ మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారుతున్నది. వాగు పొంగి పోర్లుతుండడంతో రుద్రారం-నాగసముందర్ మధ్య రాకపోకలు నిలచిపోయాయి. కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు కుంటలలో భారీగా నీరు చేరింది. కురుస్తున్న వర్షాలకు ప్రయాణాలు ఆగిపోయాయి.
దోమ: తూము నుంచి వృథాగా పోతున్న నీటిని అరికట్టే విధంగా ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ పార్థసారథి, ఏఈ సిద్ధార్థ అన్నా రు. సోమవారం ఇరిగేషన్ ఈఈ పార్థసారథి మండల తహసీల్దార్ పురుషో త్తంతో కలిసి దోమ పెద్ద చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్‌బాబు, ఆర్ఐ సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్ పాల్గొన్నారు.
బంట్వారం: మండలంలోని నూరుళ్లపూర్ వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బ్రిడ్జి కింద చెత్తా చెదారం నిండిపోవ డంతో వరద నీరంతా వాగుపై నుంచి ప్రవహిస్తుంది. తహసీల్దార్ విజయ్‌కు మార్ జేసీబీతో చెత్తను తొలగింపజేయడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం రాకపోకలకు అనుకూలంగా మారిందని తహసీల్దార్ చెప్పారు. కోట్‌పల్లి మండలంలో నాగసముందర్ బ్రిడ్జి వద్ద ప్రయాణికుల క్షేమం కొరకు తగిన చర్యలు తీసుకున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
కులకచర్ల: చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎడ్ల లాలుకు చెందిన ఇల్లు కూలిపోయింది. అయితే ఎవరికీ ప్రమాదం జరుగలేదని బాధి తుడు లాలు తెలిపారు. తమకున్న ఇళ్లు వర్షానికి కూలిపోవడంతో నిరాశ్రయుల మయ్యామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.